Andre Russell on Rinku Singh: రింకు సింగ్ కోసమే ఇండియా మ్యాచ్‌లు చూస్తున్నా: రసెల్
Andre Russell on Rinku Singh: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ టీమిండియా సరికొత్త ఫినిషర్ రింకు సింగ్ పై ప్రశంసలు కురిపించాడు. అతని కోసమే ఇండియా మ్యాచ్ లు చూస్తున్నా అని చెప్పడం విశేషం.
Andre Russell on Rinku Singh: టీమిండియా నయా స్టార్ రింకు సింగ్ అంటే విండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ కు ఎంత అభిమానమో మరోసారి బయటపడింది. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ లో రింకు కోసమే ఇండియా మ్యాచ్ లను తాను చూస్తున్నట్లు రసెల్ చెప్పడం విశేషం. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్ లో ఆడుతున్న రసెల్.. అక్కడి నుంచి హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో ఐదు సిక్స్ లు కొట్టి రింకు సింగ్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి అతనంటే రసెల్ కు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. తర్వాత మరో మ్యాచ్ లో తాను క్రీజులో ఉన్నా.. రింకుపై నమ్మకంతో చివరి బంతికి అతనికి అవకాశం ఇచ్చినట్లు రసెల్ ఆ మ్యాచ్ తర్వాత చెప్పాడు.
ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ కేవలం రింకు కోసమే చూస్తున్నట్లు చెప్పడం విశేషం. "ఈ మ్యాచ్ లను నేను చూస్తున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే హైలైట్స్ చూస్తున్నాను. అది కూడా రింకు కోసమే" అని రసెల్ అన్నాడు. ఇప్పటి వరకూ ఇండియా తరఫున నాలుగు మ్యాచ్ లలో రింకు కేవలం 59 బంతులే ఎదుర్కొన్నాడు.
కానీ అందులోనే 21 బంతులు ఫోర్లు లేదా సిక్స్ లు వెళ్లడం విశేషం. ఇక ఈ నాలుగు మ్యాచ్ లలో అతడు ఏకంగా 216.94 స్ట్రైక్ రేట్ తో 38, 37, 22, 31 స్కోర్లు చేశాడు. ధోనీ తర్వాత ఆ స్థాయి ఫినిషర్ అంటూ అప్పుడే ప్రశంసలు అందుకుంటున్నాడు. రింకు ఆడుతున్న తీరు తనకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని రసెల్ చెప్పాడు.
"రింకు ఆడుతున్న తీరు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. కొన్నేళ్ల కిందట అతడు కేకేఆర్ తో చేరాడు. ప్రతిసారీ అతడు నెట్స్ లో ఆడుతున్నప్పుడు అతని సామర్థ్యమేంటో మాకు తెలిసింది. కానీ అసలు అవకాశం అందుకొని కీలక మ్యాచ్ లలో ఒక్కో మ్యాచ్ గెలిపిస్తూ వెళ్లడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇండియన్ టీమ్ కు ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో ఆడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో అతడు మరింత మెరుగైన బ్యాటర్ అవుతాడు" అని రసెల్ స్పష్టం చేశాడు.
కేకేఆర్ లో వచ్చే ఏడాది ఐపీఎల్లో రింకుతో కలిసి తాను అద్భుతాలు చేస్తానన్న నమ్మకంతో రసెల్ ఉన్నాడు. "నన్ను రిలీజ్ చేస్తారని చాలా మంది భావించారు. కానీ ఫ్రాంఛైజీకి నాపై నమ్మకం ఉంది. నేనేం చేయగలను, గతంలో ఏం చేశానో వాళ్లకు తెలుసు. వచ్చే ఏడాది ఓ మెగా సీజన్ గా నిలవాలని నేను భావిస్తున్నాను" అని రసెల్ అన్నాడు.