Glenn Maxwell IPL : ‘వస్తాడు.. ఔట్ అవుతాడు.. రిపీట్’- 6 మ్యాచుల్లో 3 డకౌట్స్- ఇదేం చెత్త బ్యాటింగ్?
12 April 2024, 6:34 IST
- Glenn Maxwell IPL 2024 : ‘మ్యాక్స్‌వెల్‌ని ఇంకా టీమ్‌లో ఎందుకు ఉంచుతున్నారు?’ అని ఆర్సీబీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్ 2024లో ఆడిన ఆరు మ్యాచుల్లో.. 3సార్లు డకౌట్ అయ్యాడు మ్యాక్స్‌వెల్.
ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన..
Glenn Maxwell IPL 2024 stats : ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పాటు ఆ జట్టు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. మరీ ముఖ్యంగా.. ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌లలో మ్యాక్స్‌వెల్ 3సార్లు డకౌట్ అవ్వడం గమనార్హం! మ్యాక్స్‌వెల్‌పై, అతడిని ఇంకా జట్టులో ఉంచిన ఆర్సీబీపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ చెత్త ప్రదర్శన..
నిజం చెప్పాలంటే.. ఐపీఎల్లో డ్యాషింగ్, ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్స్‌లో ఒకడు మ్యాక్స్‌వెల్. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతడి సొంతం. గతంలో చాలా మ్యాచ్‌లను మలుపు తిప్పాడు కూడా. కానీ ఐపీఎల్ 2024లో మాత్రం.. అసలు బ్యాటింగ్ చేయడమే రాని వ్యక్తిగా ఆడుతున్నాడు ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్.
Maxwell IPL 2024 stats : ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన మ్యాక్స్‌వెల్.. రెండో మ్యాచ్‌లో 3 పరుగులు, మూడో మ్యాచ్‌లో 28 పరుగులు, నాలుగో మ్యాచ్‌లో సున్నా, ఐదో మ్యాచ్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు. ఇక గురువారం.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా.. ఇలా క్రీజ్‌లోకి వచ్చి, అలా డకౌట్ అయ్యి వెళ్లిపోయాడు. మొత్తం మీద చూసుకుంటే.. ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచ్‌లు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసింది.. 32 పరుగులే!
మరీ ముఖ్యంగా అతను ఔట్ అవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల్ని బ్యాట్‌కు టచ్ చేయడమే కష్టంగా మారింది. అయితే ఎల్బీడబ్ల్యూ.. లేకపోతే క్లీన్ బౌల్డ్ అన్నట్టు ఉంది ఆర్సీబీ డ్యాషింగ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరిస్థితి.
MI vs RCB IPL 2024 : గురువారం కూడా ఇదే జరిగింది! ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. రజత్ పటీదార్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్.. 4 బంతులాడి.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో, ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకుని పెవీలియన్ చేరాడు.
ఐపీఎల్ 2024లో ఇలా క్రీజ్‌లోకి వచ్చి, ఇలా వెళుతున్న మ్యాక్స్‌వెల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. చాలా మంది ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
"గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఆస్ట్రేలియాకు పులిలా ఆడుతాడు. ఆర్సీబీకి పిల్లిలా ఆడతాడు," అని ఓ నెటిజెన్ పోస్ట్ చేశారు. "ఈ ఐపీఎల్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరు దారుణంగా ఆడుతున్నారు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. "బ్యాటింగ్ చేయడు, బౌలింగ్ చేయడు.. తింటాడు, తాగుతాడు.. ఫీల్డ్‌లోకి వస్తాడు," అని ఓ నెటిజన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Maxwell RCB IPL 2024 : "మ్యాక్స్‌వెల్‌ని వదిలించుకోండి. అతను ఆర్సీబీకి ఇక ఎప్పటికీ ఆడకూడదు," అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. "4 బాల్స్ ఆడిన ఔటైన్ మ్యాక్స్‌వెల్.. సంతోషం! కనీసం అతడైనా కన్సిస్టెంట్గా డిసప్పాయింట్ చేస్తున్నాడు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. "ఆడితే.. గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు.. లేకపోతే ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడతాడు," అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.
ఇక డేటా విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్స్ రేసులో ముగ్గురు ప్లేయర్లు పోటీపడుతున్నారు! దినేశ్ కార్తిక్, రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు.. ఇప్పటివరకు 17సార్లు సున్నా చేసి పెవీలియన్‌కి వెళ్లారు. ఆ తర్వాతి స్థానంలో.. 15 డకౌట్స్ల రషీద్ ఖాన్, పీయుష్ చావ్లా, సునీల్ నరైనీ, మన్దీప్ సింగ్‌లు ఉన్నారు.