MI vs RCB: వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్-mi vs rcb live suryakumar yadav ishan kishan fifties take mumbai indians home easily over royal challengers bengaluru ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Rcb: వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

MI vs RCB: వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

Hari Prasad S HT Telugu
Apr 11, 2024 11:18 PM IST

MI vs RCB: వాంఖెడేలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పరుగుల సునామీతో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన భారీ లక్ష్యాన్ని ముంబై మంచి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేసింది.

వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్
వాంఖెడేలో సూర్య, ఇషాన్ సునామీ.. ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్ (AP)

MI vs RCB: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. సూర్యకుమార్ మరోసారి తన పరుగుల సునామీ మొదలు పెట్టిన వేళ.. ఇషాన్ కిషన్ మెరుపులు కూడా తోడవడంతో వాంఖెడేలో ఆర్సీబీని చిత్తుచిత్తుగా ఓడించింది. ఆ టీమ్ విధించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసిందంటే ఏ రేంజ్ లో చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇషాన్ దంచుడు.. సూర్య బాదుడు

ముంబై ఇండియన్స్ ముందు 197 రన్స్ లక్ష్యమంటే కాస్త కష్టమే అనిపించింది. కానీ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తీరు చూసిన తర్వాత ఎలాగోలా చేజ్ చేయడం ఖాయం అనిపించింది. కానీ ఇన్నింగ్స్ మరికాస్త ముందుకు వెళ్తున్న కొద్దీ ఎన్ని ఓవర్లు మిగిలి ఉండగా చేజ్ చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఆ రేంజ్ లో ఇషాన్ చెలరేగాడు. అతడు కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లతో 69 రన్స్ చేసి ఔటయ్యాడు.

పరుగులు వరద తగ్గుతుందని ఆర్సీబీ ఊపిరి పీల్చుకునే లోపు సూర్యకుమార్ రూపంలో ఓ సునామీయే వచ్చింది. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చి తొలి మ్యాచ్ లోనే డకౌటైన సూర్య.. ఈ మ్యాచ్ లో తన మునుపటి సత్తా చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అతనికిదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. సూర్య కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 52 రన్స్ చేసి ఔటయ్యాడు.

ఇక ఈ ఇద్దరి మధ్యలో రోహిత్ కూడా బాగానే బాదాడు. అతడు 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 38 రన్స్ చేశాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 6 బంతుల్లో 21 రన్స్ చేశాడు. ఓ సిక్స్ తో మ్యాచ్ ను తనదైన స్టైల్లో ముగించాడు.

కార్తీక్ మెరుపులు వృథా

అంతకుముందు ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్ మరోసారి తన ఫినిషింగ్ మెరుపులతో అదరగొట్టాడు. కార్తీక్ చివర్లో వచ్చి కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 53 పరుగులు చేయడం విశేషం. అతని జోరుతో ఆర్సీబీ స్కోరు 200కు దగ్గరగా వెళ్లింది. ఒక దశలో 180 పరుగులు కూడా కష్టమే అనిపించినా.. కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 196 రన్స్ చేసింది.

ఐపీఎల్ 2024లో టాప్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో మాత్రం నిరాశ పరిచాడు. అతడు 9 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. బుమ్రా అతన్ని ఔట్ చేయడం విశేషం. ఆ వెంటనే కొత్తగా జట్టులోకి వచ్చిన విల్ జాక్స్ (8) కూడా నిరాశ పరిచాడు. దీంతో ఆర్సీబీ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో కెప్టెన్ డుప్లెస్సి, రజత్ పటీదార్ ఆర్సీబీని ఆదుకున్నారు. ఫామ్ లో లేని ఈ ఇద్దరూ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగారు. ముఖ్యంగా పటీదార్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. కొట్జియా బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ లు బాది ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్.. తర్వాతి బంతికే ఔటయ్యాడు.

డుప్లెస్సితో కలిసి పటీదార్ మూడో వికెట్ కు 82 పరుగులు జోడించాడు. పటీదార్ ఔటైన తర్వాత డుప్లెస్సి కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆలోపే మ్యాక్స్‌వెల్ మరోసారి డకౌటై వెళ్లాడు. డుప్లెస్సి కూడా 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 61 రన్స్ చేశాడు.

బుమ్రాకు 5 వికెట్లు

ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా చెలరేగాడు. అతడు కోహ్లితోపాటు డుప్లెస్సి, మహిపాల్ లొమ్రోర్, సౌరవ్ చౌహాన్, వైశాక్ లను ఔట్ చేశాడు. అయితే మిగతా ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం నిరాశ పరిచారు.

స్టార్ బౌలర్ కొట్జియా 4 ఓవర్లలో 42 రన్స్ ఇవ్వగా.. ఆకాశ్ మధ్వాల్ ఏకంగా 4 ఓవర్లలో 57 రన్స్ సమర్పించుకున్నాడు. కార్తీక్ దెబ్బకు ఆకాశ్ తన చివరి రెండు ఓవర్లలోనే ఏకంగా 39 పరుగులు ఇచ్చాడు.

Whats_app_banner