MI vs RCB Live: వాంఖెడెలో కార్తీక్ మెరుపులు.. బుమ్రా పిడుగులు.. ఆర్సీబీ భారీ స్కోరు-mi vs rcb live score faf du plessis rajat patidar fifties dinesh karthik finishing touch give rcb huge score ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Rcb Live: వాంఖెడెలో కార్తీక్ మెరుపులు.. బుమ్రా పిడుగులు.. ఆర్సీబీ భారీ స్కోరు

MI vs RCB Live: వాంఖెడెలో కార్తీక్ మెరుపులు.. బుమ్రా పిడుగులు.. ఆర్సీబీ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
Apr 11, 2024 09:41 PM IST

MI vs RCB Live: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లి ఫెయిలైనా.. డుప్లెస్సి, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే బుమ్రా 5 వికెట్లతో ఆర్సీబీని కొంత మేర కట్టడి చేశాడు.

కోహ్లి ఫెయిలైనా హాఫ్ సెంచరీలతో చెలరేగిన డుప్లెస్సి, పటీదార్
కోహ్లి ఫెయిలైనా హాఫ్ సెంచరీలతో చెలరేగిన డుప్లెస్సి, పటీదార్ (IPL-X)

MI vs RCB Live: ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మెరుపులు, ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా పిడుగులతో వాంఖెడే స్టేడియం దద్దరిల్లిపోయింది. కార్తీక్ తోపాటు డుప్లెస్సి, రజత్ పటీదార్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 రన్స్ చేసింది. మరోవైపు బుమ్రా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఆర్సీబీకి కొంతమేర చెక్ పెట్టాడు. దీంతో అతడు పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు.

కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్

ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్ మరోసారి తన ఫినిషింగ్ మెరుపులతో అదరగొట్టాడు. కార్తీక్ చివర్లో వచ్చి కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 53 పరుగులు చేయడం విశేషం. అతని జోరుతో ఆర్సీబీ స్కోరు 200కు దగ్గరగా వెళ్లింది. ఒక దశలో 180 పరుగులు కూడా కష్టమే అనిపించినా.. కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 196 రన్స్ చేసింది.

కోహ్లి ఫెయిలైనా..

అంతకుముందు ఐపీఎల్ 2024లో టాప్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో మాత్రం నిరాశ పరిచాడు. అతడు 9 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. బుమ్రా అతన్ని ఔట్ చేయడం విశేషం. ఆ వెంటనే కొత్తగా జట్టులోకి వచ్చిన విల్ జాక్స్ (8) కూడా నిరాశ పరిచాడు. దీంతో ఆర్సీబీ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో కెప్టెన్ డుప్లెస్సి, రజత్ పటీదార్ ఆర్సీబీని ఆదుకున్నారు. ఫామ్ లో లేని ఈ ఇద్దరూ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగారు. ముఖ్యంగా పటీదార్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. కొట్జియా బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ లు బాది ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్.. తర్వాతి బంతికే ఔటయ్యాడు.

డుప్లెస్సితో కలిసి పటీదార్ మూడో వికెట్ కు 82 పరుగులు జోడించాడు. పటీదార్ ఔటైన తర్వాత డుప్లెస్సి కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆలోపే మ్యాక్స్‌వెల్ మరోసారి డకౌటై వెళ్లాడు. డుప్లెస్సి కూడా 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 61 రన్స్ చేశాడు.

బుమ్రాకు 5 వికెట్లు

ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా చెలరేగాడు. అతడు కోహ్లితోపాటు డుప్లెస్సి, మహిపాల్ లొమ్రోర్, సౌరవ్ చౌహాన్, వైశాక్ లను ఔట్ చేశాడు. అయితే మిగతా ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం నిరాశ పరిచారు.

స్టార్ బౌలర్ కొట్జియా 4 ఓవర్లలో 42 రన్స్ ఇవ్వగా.. ఆకాశ్ మధ్వాల్ ఏకంగా 4 ఓవర్లలో 57 రన్స్ సమర్పించుకున్నాడు. కార్తీక్ దెబ్బకు ఆకాశ్ తన చివరి రెండు ఓవర్లలోనే ఏకంగా 39 పరుగులు ఇచ్చాడు.

Whats_app_banner