IPL 2024 Flopped stars: ఐపీఎల్ 2024లో దారుణంగా నిరాశపరుస్తున్న టాప్ 5 స్టార్ ప్లేయర్స్ వీళ్లే
IPL 2024 Flopped stars: ఐపీఎల్ 2024లో కొందరు ప్లేయర్స్ దారుణంగా విఫలమవుతున్నారు. వాళ్ల వైఫల్యం ఆయా జట్ల విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఫెయిలైన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో చూడండి.
IPL 2024 Flopped stars: ఐపీఎల్ 2024లో సుమారు మూడు వారాలు గడిచిపోయాయి. మంగళవారం (ఏప్రిల్ 9) నాటికి 23 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఇప్పటికీ కొందరు టాప్ ప్లేయర్స్ విఫలమవుతూనే ఉన్నారు. వాళ్ల ఫామ్ లేమి ఆయా టీమ్స్ కొంప ముంచుతోంది. అలా విఫలమవుతున్న టాప్ 5 ప్లేయర్స్ లో ముగ్గురు ఆర్సీబీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం.
ఐపీఎల్ 2024 ఫ్లాప్ స్టార్స్
ఐపీఎల్ 2024లో తీవ్రంగా నిరాశ పరుస్తున్న ఐదుగురు ప్లేయర్స్ లో ఆర్సీబీకి చెందిన డుప్లెస్సి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ లతోపాటు కేకేఆర్ కు చెందిన మిచెల్ స్టార్క్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు.
మిచెల్ స్టార్క్ - రిచెస్ట్ ప్లేయర్ ఫ్లాప్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్. అతనిపై ఎన్నో ఆశలతో కోల్‌కతా నైట్ రైడర్స్ గత వేలంలో ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ టీమ్ ఆడిన 4 మ్యాచ్ లలో స్టార్క్ కేవలం రెండే వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తూ ఏకంగా 11 ఎకానమీ రేటు నమోదు చేస్తున్నాడు. ఆ టీమ్ మొదటి మూడు మ్యాచ్ లలో గెలిచినా స్టార్క్ ప్రభావం మాత్రం అసలు ఏమీ లేదు.
ఫాఫ్ డుప్లెస్సి
ఆర్సీబీ కెప్టెన్ అయిన ఫాఫ్ డుప్లెస్సి కూడా ఈ ఏడాది తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. సీజన్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో బౌండరీల మీద బౌండరీలు బాదుతూ మంచి ఊపు మీద కనిపించిన డుప్లెస్సి తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు. 5 మ్యాచ్ లలో అతని స్కోర్లు 35, 3, 8, 19, 44గా ఉన్నాయి. ఓవైపు కోహ్లి టాప్ ఫామ్ లో ఉండగా.. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ డుప్లెస్సి విఫలమవుతుండటం ఆర్సీబీ కొంప ముంచుతోంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్
మరో ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయితే మరీ దారుణం. మిడిలార్డర్ లో ధాటిగా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 2024లో చేతులెత్తేస్తున్నాడు. ఐదు మ్యాచ్ లలో కేవలం 32 రన్స్ మాత్రమే చేశాడు. ఈ ఇద్దరి వైఫల్యంతో ఆర్సీబీ బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లిపైనే పడుతోంది.
హార్దిక్ పాండ్యా
గుజరాత్ టైటన్స్ నుంచి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కు వచ్చి ఏకంగా కెప్టెన్ అయిపోయిన హార్దిక్ పాండ్యా.. అన్ని విధాలుగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ నాలుగు మ్యాచ్ లలో అతడు 11, 24, 34, 39 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ లో అయితే రెండు మ్యాచ్ లలో అసలు బంతి ముట్టలేదు. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
మహ్మద్ సిరాజ్
ఆర్సీబీ ఈ సీజన్లో వరుసగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ల బౌలింగ్ బలహీనతే. అందులోనూ స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐదు మ్యాచ్ లలో కలిపి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఒక్క మ్యాచ్ లో తప్ప మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ తన 4 ఓవర్ల కోటాలో కనీసం 35 పరుగుల కంటే ఎక్కువే ఇచ్చాడు.