Mumbai Indians: ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై.. ఒక్క హాఫ్ సెంచరీ లేకపోయినా 234 రన్స్.. బుమ్రా సూపర్ యార్కర్.. ఓడిన ఢిల్లీ
MI vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఎట్టకేలకు బోణీ కొట్టింది ముంబై ఇండియన్స్ జట్టు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు జరిగిన మ్యాచ్‍లో ముంబై గెలిచింది. ఈ సీజన్‍లో తన పాయింట్ల ఖాతా తెరిచింది.
Mumbai Indians vs Delhi Capitals IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో మూడు పరాజయాల తర్వాత ఎట్టకేలకు బోణీ కొట్టింది ముంబై ఇండియన్స్ (MI). ఈ సీజన్‍లో తొలిసారి గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో నేడు (ఏప్రిల్ 7) తన హౌం గ్రౌండ్‍లో జరిగిన మ్యాచ్‍లో విజయం సాధించి పట్టికలో ఖాతా తెరిచింది హార్దిక్ పాండ్యా సేన. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది.
ఒక్క అర్ధ సెంచరీ లేకుండా భారీ స్కోరు
టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. ముంబై బ్యాటర్లు సమిష్టిగా హిట్టింగ్‍తో అదరగొట్టారు. మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 27 బంతుల్లోనే 49 పరుగులతో (6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టాడు. తన మార్క్ హిట్టింగ్‍తో రెచ్చిపోయాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42 పరుగులు; 4 ఫోర్లు 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఢిల్లీ బౌలర్లను బాదేశారు ఈ ఇద్దరూ. అయితే, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఏడో ఔవర్లో రోహిత్ ఔటయ్యాడు. అయితే, గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ 2024 సీజన్‍లో తొలిసారి బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయి నిరాశపరిచాడు. ఇషాన్ ఔటయ్యాక.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39 పరుగులు) వేగంగా ఆడలేకపోయాడు. తిలక్ వర్మ (6) విఫలమయ్యాడు.
ముంబై బ్యాటర్ టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా అదరగొట్టాడు. మెరుపు హిట్టింగ్‍తో మైమపిరించాడు. 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు. చివర్లో ముంబై బ్యాటర్ రొమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 39 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. ఢిల్లీ పేసర్ ఎన్రిచ్ నార్జే వేసిన ఓవర్లో ఏకంగా 32 పరుగులతో దుమ్మురేపాడు. ఆ ఓవర్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుపడ్డాడు. మొత్తంగా 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా.. భారీ స్కోరును ముంబై సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్రిచ్ నార్జే తలా రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశారు.
రొమారియో క్రేజీ హిట్టింగ్
ఢిల్లీ పేసర్ ఎన్రిచ్ నార్జే వేసిన 20 ఓవర్లో ముంబై ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ అదరగొట్టాడు. క్రేజీ హిట్టింగ్ చేశాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన అతడు.. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టిన షెఫర్డ్.. చివరి బంతికి సిక్స్ బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చేశాయి.
బమ్రా కళ్లు చెదిరే యార్కర్
ముంబై స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‍లో మరో అద్భుత యార్కర్ వేశాడు. ఢిల్లీ యంగ్ స్టార్ బ్యాటర్ పృథ్వి షాను సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీతో జోరు మీద ఉన్న పృథ్వీని బుమ్రా 12వ ఓవర్లో ఔట్ చేశాడు. పృథ్వి బ్యాట్‍ను కిందికి దించేలోపే బుమ్రా వేసిన బంతి దూసుకెళ్లి వికెట్లకు తాకింది. దీంతో షా షాకయ్యాడు.
పృథ్వి, స్టబ్స్ మెరిసినా..
కొండంత లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆస్థాయిలో రాణించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేయగలిగింది. సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (10) విఫలమయ్యాడు. యువ స్టార్ పృథ్వి షా 40 బంతుల్లోనే 66 పరుగులతో మంచి అర్ధ శకతం చేశాడు. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెరిపించాడు. తన మార్క్ షాట్లతో అలరించాడు. మరో ఎండ్‍లో అభిషేక్ పోరెల్ (31 బంతుల్లో 41 రన్స్) అవసరమైన మేర వేగంగా ఆడలేకపోయాడు. పృథ్వి, పోరెల్ ఔటయ్యాక.. చివర్లో ట్రిస్టాన్ స్టబ్స్ 27 బంతుల్లోనే 71 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి పోరాడాడు. అయితే, అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (1), అక్షర్ పటేల్ (8) సహా మిగిలిన ఢిల్లీ బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో గెలార్డ్ కొయిట్జీ నాలుగు వికెట్లతో రాణించగా.. జస్‍ప్రీత్ బమ్రా రెండు, రొమారియో షెఫర్డ్ ఓ వికెట్ తీసుకున్నారు.
ఢిల్లీ లాస్ట్.. ముంబై పైకి..
ఈ సీజన్‍లో మూడు పరాజయాల తర్వాత.. తొలి గెలుపుతో రెండు పాయింట్లు దక్కించుకున్న ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి వచ్చింది. ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరిదైన 10వ ప్లేస్‍కు పడిపోయింది.