Ishan Kishan: సూపర్ మ్యాన్ గెటప్‌లో ఇషాన్ కిషన్ - స్టైల్ కాదు పనిష్‌మెంట్ అంట!
Ishan Kishan: ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ గెటప్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. క్రమశిక్షణను పాటించనందువల్లే సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపించాలని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి పనిష్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
Ishan Kishan: ఐపీఎల్ 2024లో గెలుపు బోణీ కొట్టని జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. వరుసగా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ముంబై నిలిచింది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై సన్నద్ధమవుతోంది.
సూపర్ మ్యాన్ గెటప్‌లో...
ఢిల్లీతో మ్యాచ్ కోసం మరో రెండు రోజులు టైమ్ ఉండటంతో ప్లేయర్లను యాజమాన్యం డామన్ అండ్ డయ్యూ పంపించింది. గురువారం ముంబై ప్లేయర్లు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ముంబై ప్లేయర్లు చాలా మంది టీమ్ జెర్సీలోనే కనిపించగా ఇషాన్ కిషన్ మాత్రం సూపర్ మ్యాన్ గెటప్‌లో ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చాడు. సూపర్ మ్యాన్ గెటప్‌లో నే మీడియాకు ఫోజులిచ్చాడు ఇషాన్ కిషన్. స్టైల్ కోసమే ఇషాన్ సూపర్ మ్యాన్ గెటప్ వేశాడని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదట.
పనిష్‌మెంట్...
సూపర్ మ్యాన్ గెటప్ అన్నది పనిష్‌మెంట్ అని సమాచారం. టీమ్ మీటింగ్‌లకు ఆలస్యంగా వచ్చే ప్లేయర్లు సూపర్ మ్యాన్ గెటప్ లో కనిపించాలని ముంబై యాజమాన్యం రూల్ పెట్టిందట. ప్లేయర్లను క్రమశిక్షణ తప్పకుండా అదపులో పెట్టడానికే ఈ ఫన్నీ పనిష్‌మెంట్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ పనిష్‌మెంట్‌లో భాగంగానే ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ గెటప్ లో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినట్లు సమాచారం. ఇషాన్ కిషన్‌తో పాటు కుమార కార్తికేయ, నువాన్ తుషార, షామ్స్ ములానీ కూడా సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఎక్స్‌ట్రాలు తగ్గిస్తే మంచిది...
ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ గెటప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. షోకులు ఎక్కువ ఆటలు తక్కువ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ ఎక్స్‌ట్రాలు తగ్గిస్తే మంచిదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశాడు. క్రమశిక్షణను పాటించకపోవడం ఇషాన్‌కు కొత్త కాదంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండకుండా రంజీలకు దూరమై దుబాయ్ టూర్ వెళ్లిన ఇషాన్ కిషన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. క్రమశిక్షణ తప్పినందుకు అతడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది.
మూడు మ్యాచుల్లో యాభై రన్స్...
ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన ఇషాన్ కిషన్ మూడు మ్యాచుల్లో కేవలం యాభై పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీతో జరుగనున్న మ్యాచ్‌లో అతడికి స్థానం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 94 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 2374 రన్స్ చేశాడు. టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్‌లు, 27 వన్డేలు ఆడాడు ఇషాన్ కిషన్. 2023 నవంబర్‌లో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు ఇషాన్ కిషన్. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వరల్డ్ కప్‌కు అతడు సెలెక్ట్ అయినా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.