Maxwell on Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేయొద్దు: ఆర్సీబీ టీమ్మేట్ షాకింగ్ కామెంట్స్
11 April 2024, 18:47 IST
- Maxwell on Virat Kohli: విరాట్ కోహ్లి ఆర్సీబీ టీమ్మేట్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా అతన్ని టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక చేయదని ఆశిస్తున్నా అని అతడు అనడం గమనార్హం.
టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేయొద్దు: ఆర్సీబీ టీమ్మేట్ షాకింగ్ కామెంట్స్
Maxwell on Virat Kohli: ఐపీఎల్ 2024 జరుగుతుండగానే టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ ఎంపికపై చర్చ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి విరాట్ కోహ్లి ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మొన్న ఐపీఎల్లో అత్యంత నెమ్మదైన సెంచరీ చేసిన కోహ్లిని ఎంపిక చేయొద్దని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఆర్సీబీ టీమ్మేట్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కోహ్లిని ఎంపిక చేయొద్దని ఆశిస్తున్నా: మ్యాక్సీ
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ఫెయిలవుతున్నా విరాట్ కోహ్లి మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది. అతని ఆటతీరు చూసిన ఆర్సీబీ టీమ్మేట్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. కోహ్లిని టీ20 వరల్డ్ కప్ కు ఎక్కడ ఎంపిక చేస్తారో అని భయపడుతున్నాడు. తన కెరీర్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థి కోహ్లియే అని మ్యాక్సీ అన్నాడు.
ఈ సందర్భంగా 2016 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ను అతడు గుర్తు చేసుకున్నాడు. "నేను ఆడిన ప్రత్యర్థుల్లో విరాట్ కోహ్లియే అత్యంత కఠినమైన ప్రత్యర్థి. అతడు 2016 టీ20 వరల్డ్ కప్ లో మొహాలీలో మాపై ఆడిన ఇన్నింగ్స్ నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్. మ్యాచ్ గెలిపించాలంటే ఏం చేయాలన్న అతని అవగాహన అత్యద్భుతం. అతన్ని ఇండియా ఎంపిక చేయొద్దనే ఆశిస్తున్నా. అలాంటి ప్లేయర్ తో పోటీ పడకపోవడమే మంచిది" అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.
ఇక ఇండియాలో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మ్యాక్సీ అభిప్రాయపడ్డాడు. "ఈ దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. అందులో సగం మంది నమ్మశక్యం కాని క్రికెటర్లే ఉండొచ్చు (నవ్వుతూ). వాళ్ల జట్టులోకి రావడం అంత సులువు కాదు. ఈ టోర్నీలో ఆడుతున్న అందరు టాప్ టీ20 ప్లేయర్స్ ను చూడండి. వాళ్లంతా అద్భుతమైన ప్లేయర్స్. అందరిలోనూ ఓ తపన కనిపిస్తుంది" అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.
టాప్ ఫామ్‌లో కోహ్లి
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో కోహ్లి 316 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు అతడు 146.29 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తున్నాడు. ఇక మరో నాలుగు సిక్స్ లు కొడితే ఐపీఎల్లో 250 సిక్స్ లు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్ గా అతడు నిలుస్తాడు.
గురువారం (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనే అతడు ఈ రికార్డు అందుకుంటాడేమో చూడాలి. ఆర్సీబీలో కోహ్లితోపాటు డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి టాప్ బ్యాటర్లు ఉన్నా వాళ్లంతా విఫలమవుతున్నారు. దీంతో భారమంతా కోహ్లిపైనే పడుతోంది. అతని ఒంటరి పోరాటం ఆర్సీబీని గెలిపించడం లేదు. అందులోనూ అతడు చేసిన సెంచరీపైనా విమర్శలు రావడం మరో విచిత్రం.
టాపిక్