Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. రోహిత్ శర్మను సమం చేసిన ఆస్ట్రేలియా హిట్టర్-aus vs wi 2nd t20i glenn maxwell hits century against west indies and levels indian player rohit sharma t20 hundred reco ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. రోహిత్ శర్మను సమం చేసిన ఆస్ట్రేలియా హిట్టర్

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. రోహిత్ శర్మను సమం చేసిన ఆస్ట్రేలియా హిట్టర్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 11, 2024 04:02 PM IST

AUS vs WI 2nd T20 - Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో దుమ్మురేపాడు. వెస్టిండీస్‍తో రెండో టీ20లో భీకర హిట్టింగ్ చేశాడు. ఈ క్రమంలో భారత స్టార్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (AFP)

Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ మరోసారి భీకర హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. మెరుపు శతకంతో రెచ్చిపోయాడు. ఆడిలైడ్ వేదికగా నేడు (ఫిబ్రవరి 11) వెస్డిండీస్‍తో జరుగుతున్న రెండో టీ20లో మ్యాక్సీ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 120 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్. ధనాధన్ ఆటతో.. తన మార్క్ డిఫరెంట్ షాట్లతో బౌండరీల మోత మోగించాడు. ఈ శకతంతో భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును మ్యాక్సీ సమం చేశాడు.

రోహిత్ శర్మ రికార్డు సమం

వెస్టిండీస్‍తో ఈ రెండో టీ20లో మ్యాక్స్‌వెల్ సూపర్ హిట్టింగ్‍తో సత్తాచాటాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఐదో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (5 శతకాలు) రికార్డును మ్యాక్సీ సమం చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో భారత స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ (4 సెంచరీలు) ఉన్నాడు.

రోహిత్ శర్మ 143 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో (151 మ్యాచ్‍లు) 5 సెంచరీలు చేస్తే.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 94 ఇన్నింగ్స్‌ (101 మ్యాచ్‍లు)లో ఈ మార్క్ చేరుకున్నాడు. అయితే, భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌లోనే నాలుగు సెంచరీలు చేసి ప్రస్తుతం ఆ తర్వాతి ప్లేస్‍లో ఉన్నాడు.

మ్యాక్సీ 109 మీటర్ల సిక్స్

వెస్టిండీస్‍తో ఈ రెండో టీ20లో మ్యాక్స్‌వెల్ ఓ మాన్‍స్టర్ సిక్స్ కొట్టాడు. ఏకంగా 109 మీటర్ల సిక్స్ బాదేశాడు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన 12 ఓవర్లో రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు మ్యాక్సీ. దీంతో బంతి రెండో స్టైర్ స్టాండ్స్‌లో పడింది. ఏకంగా 109 మీటర్ల దూరం వెళింది.

ఆస్ట్రేలియా భారీ స్కోరు

మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగడంతో ఈ రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించింది. ఓపెనర్లు జోస్ ఇంగ్లిస్ (4), డేవిడ్ వార్నర్ (22) ఎక్కువ సేపు నిలులేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్.. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

మ్యాక్సీకి తోడు కాసేపు వేగంగా ఆడిన కెప్టెన్ మిచెల్ మార్ష్ (29) ఔటయ్యాడు. అయినా మ్యాక్స్‌వెల్ బాదుడు ఆపలేదు. తన మార్క్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. స్టొయినిస్ (16) విఫలమైనా. . టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 రన్స్) మాత్రం చివరి వరకు మ్యాక్స్‌వెల్‍తో నిలిచాడు. ఈ క్రమంలో 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు మ్యాక్స్‌వెల్. చివరి వరకు కూడా అదే జోరు కొనసాగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫర్డ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు వేసిన ఆండ్రీ రసెల్ ఏకంగా 59 పరుగుల సమర్పించుకున్నాడు. వెస్టిండీస్ ముందు 242 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

Whats_app_banner