AUS vs WI: ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చరిత్రాత్మక గెలుపు.. ‘27 ఏళ్ల తర్వాత’.. ఆ యువ పేసర్‌కు సలాం అంటున్న నెటిజన్లు
AUS vs WI 2nd Test: ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు గెలిచింది. ఈ సూపర్ గెలుపుతో సిరీస్‍ను సమం చేసుకుంది విండీస్.
Australia vs West Indies Test Series: వెస్టిండీస్ చరిత్రాత్మక విజయంతో సత్తాచాటింది. ఆస్ట్రేలియాకు కంచుకోటగా భావించే బ్రిస్బేన్‍లో ఆ జట్టును విండీస్ ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టులో విజయం సాధించింది వెస్టిండీస్. బ్రిస్బేన్‍లోని గబ్బా మైదానం వేదికగా జరిగిన రెండు టెస్టులో నేడు (జనవరి 28) వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ విజయం సాధించింది. నాలుగో రోజే గెలిచింది.
వెస్టిండీస్ యువ బౌలర్ షామర్ జోసఫ్ 7 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలి వేలికి తీవ్ర గాయమైనా.. నొప్పిని భరిస్తూ బౌలింగ్ చేసిన ఈ 24 ఏళ్ల యువ పేసర్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కుప్పకూల్చాడు. వెస్టిండీస్‍కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు.
216 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నేడు 207 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (146 బంతుల్లో 91 పరుగులు) చివరి వరకు అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. అయితే, కామెరూన్ గ్రీన్ (42) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ 11.5 ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టి విజృంభించడంతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. అల్జారీ జోసెఫ్ రెండు, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ తీశారు. దీంతో ఈ రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.
2 వికెట్లకు 60 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నాలుగో రోజైన నేడు ఆట కొనసాగించింది ఆస్ట్రేలియా. స్మిత్ ఓ వైపు నిలకడగా.. గ్రీన్ కాసేపు సహకరించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (10), అలెక్స్ క్యారీ (2), మిచెల్ స్టార్క్ (21), ప్యాట్ కమిన్స్ (2)ను షామర్ జోసఫ్ ఔట్ చేశాడు. ఆసీస్ బ్యాటర్లను వణికిస్తూ వరుసగా వికెట్లు తీశాడు. తాను అరంగేట్రం చేసిన సిరీస్‍లోనే రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చివరగా జోస్ హేజిల్‍వుడ్ (0)ను కూడా పెలివియన్‍కు పంపాడు.
27 ఏళ్ల తర్వాత..
ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ సుమారు 27 ఏళ్ల తర్వాత టెస్టులో విజయం సాధించింది. ఆ జట్టు చివరగా ఆ దేశంలో 1997లో గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు గెలువలేకపోయింది. ఇప్పుడు క్రెగ్ బ్రాత్‍వైట్ సారథ్యంలో 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు గెలుపు నమోదు చేసింది.
షామార్ జోసెఫ్‍కు సలాం
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన షామర్ జోసెఫ్‍కు గాయమైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న జోసెఫ్ కాలి వేళ్లకు వేగంగా తగిలింది. దీంతో షామర్ కులికాలి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే, కాలి వేలికి అంత తీవ్ర గాయమైనా.. బౌలింగ్ చేసేందుకు షామర్ జోసెఫ్ ముందుకు వచ్చాడు. ఏకంగా ఏడు వికెట్ల పడగొట్టి.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‍ను కుప్పకూల్చాడు. వెస్టిండీస్‍కు గెలుపు కట్టబెట్టాడు. దీంతో షామర్ జోసెఫ్‍పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రియల్ వారియర్ అంటూ అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. షామర్‌కు సెల్యూట్ అంటూ పోస్టులు చేస్తున్నారు. తన అరంగేట్ర టెస్టు సిరీస్‍లోనే అతడు చూపిన తెగువకు సలాం అంటున్నారు.
ఈ రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 9 వికెట్లకు 289 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 193 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా ముందు 216 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే, చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ విజయం సాధించింది.