AB de villiers on RCB: ఆర్సీబీ గెలవాలంటే విరాట్ కోహ్లి ఇలా చేయాలి: ఏబీ డివిలియర్స్-ipl 2024 ab de villiers winning formula for rcb virat kohli should be there in the middle overs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ab De Villiers On Rcb: ఆర్సీబీ గెలవాలంటే విరాట్ కోహ్లి ఇలా చేయాలి: ఏబీ డివిలియర్స్

AB de villiers on RCB: ఆర్సీబీ గెలవాలంటే విరాట్ కోహ్లి ఇలా చేయాలి: ఏబీ డివిలియర్స్

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 02:44 PM IST

AB de villiers on RCB: ఐపీఎల్ 2024లోనూ వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ ఆ టీమ్ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ కీలక సూచన చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లికి అతడు ఇచ్చిన సలహా ఇది.

ఆర్సీబీ గెలవాలంటే విరాట్ కోహ్లి ఇలా చేయాలి: ఏబీ డివిలియర్స్
ఆర్సీబీ గెలవాలంటే విరాట్ కోహ్లి ఇలా చేయాలి: ఏబీ డివిలియర్స్ (PTI)

AB de villiers on RCB: ఐపీఎల్ సీజన్ల మీద సీజన్లు గడిచిపోతూనే ఉన్నా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రం టైటిల్ గెలవలేకపోతోంది. ఈ సీజన్లోనూ నాలుగు మ్యాచ్ లలో మూడు ఓడి ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ కీలకమైన సూచన చేశాడు.

కోహ్లికి డివిలియర్స్ ఇచ్చిన సలహా ఇదే

ఆర్సీబీ టైటిల్ గెలవాలంటే విరాట్ కోహ్లిదే కీలకపాత్ర అని అందరికీ తెలుసు. ఈ సీజన్లో ఆర్సీబీ మూడు మ్యాచ్ లు ఓడినా.. కోహ్లి మాత్రం బాగానే ఆడుతున్నాడు. అయితే జట్టును గెలిపించాలంటే అతడు ఏం చేయాలో ఇప్పుడు ఏబీ చెబుతున్నాడు. మిడిల్ ఓవర్ల వరకూ కోహ్లి ఉండాలని, ముఖ్యంగా ఆరు నుంచి 15వ ఓవర్లలోనే బాగా ఆడితేనే ఆర్సీబీ గెలుస్తుందని డివిలియర్స్ చెప్పాడు.

విరాట్ కోహ్లి ఈ సీజన్లో 4 మ్యాచ్ లలో 67.66 సగటుతో 203 రన్స్ చేశాడు. అయితే అతనితోపాటు కీలక బ్యాటర్లందరూ టాప్ లోనే వచ్చి అసలు సమయానికి పెవిలియన్ కు వెళ్లిపోతున్నారు. ఇదే విషయాన్ని ఏబీ లేవనెత్తాడు. డుప్లెస్సి రిస్క్ తీసుకోవాలని, కోహ్లి నెమ్మదిగా మిడిల్ ఓవర్ల వరకూ క్రీజులో ఉండాలని సూచించాడు.

"విరాట్ కోహ్లి తన మంచి ఆరంభాన్ని కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. మిడిలార్డర్ లో ఆర్సీబీకి కోహ్లి చాలా అవసరం. మొదటి ఆరు ఓవర్లు కాస్త జాగ్రత్తగా ఆడి మిడిల్ ఓవర్ల వరకూ కోహ్లి ఉండాలి. మొదట్లో డుప్లెస్సి రిస్క్ తీసుకోవాలి. కానీ కోహ్లి మాత్రం 6 నుంచి 15 ఓవర్ల మధ్య క్రీజులో ఉండాలి. అప్పుడే ఆర్సీబీ సక్సెస్ అవుతుంది" అని డివిలియర్స్ అన్నాడు.

రెండు గెలిస్తే చాలు..

ఈ సీజన్లో ఆర్సీబీ మూడు మ్యాచ్ లలో ఓడినా.. అదేమంత చెత్త ఆరంభం ఏమీ కాదని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. "ఆర్సీబీ.. మరీ అంత చెత్త ఆరంభం కాదు. అలాగని మంచిదీ కాదు. వాళ్లకు రెండు విజయాలు కావాలి. అంతే వాళ్లు గాడిలో పడతారు. తిరిగి చిన్నస్వామికి తిరిగొచ్చేలోపు వాళ్లకు బయటైనా అదృష్టం కలిసి రావాలి" అని డివిలియర్స్ చెప్పాడు.

ఈ ఏడాది ఆర్సీబీ వుమెన్స్ టీమ్ డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడంతో మెన్స్ టీమ్ పైనా భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎప్పటిలాగే ఆ టీమ్ మొదట్లోనే తడబడింది. నాలుగు మ్యాచ్ లలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. కోహ్లి తప్ప మిగతా టాప్ బ్యాటర్లు డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్, రజత్ పటీదార్ లాంటి బ్యాటర్లు విఫలమవుతున్నారు. అటు బౌలింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆర్సీబీకి వరుస ఓటములు తప్పడం లేదు.

ఇక సొంత మైదానంలోనే మూడు మ్యాచ్ లు ఆడి అందులో రెండు ఓడింది. ఇక ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఆ టీమ్ ప్రత్యర్థి వేదికల్లో ఆడబోతోంది. చిన్నస్వామిని వీడిన తర్వాతైనా ఆ టీమ్ కు కాస్త అదృష్టం కలిసొచ్చి విజయాల బాట పడుతుందా లేక ఈ సీజన్లోనూ చేతులెత్తేస్తుందా చూడాలి.

Whats_app_banner