Ambati Rayudu on RCB: ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు: లక్నోతో ఓటమి తర్వాత అంబటి రాయుడు ఘాటు విమర్శ-ambati rayudu says rcb will never win ipl criticizes their big players virat kohli faf du plessis maxwell cameron green ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ambati Rayudu On Rcb: ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు: లక్నోతో ఓటమి తర్వాత అంబటి రాయుడు ఘాటు విమర్శ

Ambati Rayudu on RCB: ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు: లక్నోతో ఓటమి తర్వాత అంబటి రాయుడు ఘాటు విమర్శ

Hari Prasad S HT Telugu
Apr 03, 2024 03:40 PM IST

Ambati Rayudu on RCB: ఆర్సీబీలాంటి టీమ్ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు అంటూ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఘాటైన విమర్శలు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓటమి తర్వాత అతడీ కామెంట్స్ చేశాడు.

ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు: లక్నోతో ఓటమి తర్వాత అంబటి రాయుడు ఘాటు విమర్శ
ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదు: లక్నోతో ఓటమి తర్వాత అంబటి రాయుడు ఘాటు విమర్శ (AFP)

Ambati Rayudu on RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ టీమ్ డబ్ల్యూపీఎల్ గెలిచిన తర్వాత ఎన్నో ఆశలతో మెన్స్ టీమ్ ఐపీఎల్ 2024 బరిలోకి దిగింది. కానీ ఎప్పటిలాగే ఒత్తిడికి తట్టుకోలేక చిత్తవుతోంది. నాలుగు మ్యాచ్ లలో మూడింట్లో ఓడి 9వ స్థానంలో ఉంది. దీంతో ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదంటూ ఆరుసార్లు ఈ ట్రోఫీ గెలిచిన టీమ్ లో ఉన్న అంబటి రాయుడు విమర్శించాడు.

ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవదు

ఆర్సీబీలాంటి టీమ్ ట్రోఫీ గెలవదు అని రాయుడు విమర్శించడానికి బలమైన కారణమే ఉంది. ఆ టీమ్ లోని టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ టాప్ లోనే బ్యాటింగ్ కు దిగి విఫలమవుతున్నారు. దీంతో భారమంతా లోయర్ మిడిలార్డర్ లో వచ్చే అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్లపై పడుతోంది. ఇలా అయితే ట్రోఫీ ఎలా గెలుస్తారంటూ రాయుడు ప్రశ్నించాడు.

"వాళ్ల జట్టును చూడండి. ఒత్తిడి బాగా ఎక్కువున్న సమయంలో ఎవరు ఆడతారు? దినేష్ కార్తీక్ తోపాటు యంగ్ ఇండియన్ బ్యాటర్లే. మీ పెద్ద ప్లేయర్స్, అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఒత్తిడిని తట్టుకుంటారో వాళ్లు ఎక్కడ? అందరూ అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొన్నారు. గత 16 ఏళ్లుగా ఈ టీమ్ తో ఇదే జరుగుతూ వస్తోంది" అని రాయుడు అన్నాడు.

గతంలో గేల్, కోహ్లి, డివిలియర్స్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు కూడా వాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్లో పైనే వచ్చేవారు. ఇదే విషయాన్ని రాయుడు ప్రస్తావించాడు. "ఆర్సీబీ కథ ఎప్పుడూ ఇంతే. ఒత్తిడిలో వాళ్ల జట్టులోని ఒక్క పెద్ద ప్లేయర్ కూడా కనిపించడు. లోయర్ ఆర్డర్ లో యువ ప్లేయర్స్ వస్తున్నారు. పెద్ద ప్లేయర్స్ అందరూ టాప్ లో వెళ్లి వచ్చేస్తున్నారు. ఇలాంటి జట్టు ఎప్పటికీ గెలవదు. అందుకే వాళ్లు ఇన్నాళ్లుగా ఐపీఎల్ గెలవలేకపోయారు" అని రాయుడు అన్నాడు.

ఆర్సీబీ చెత్త రికార్డు

నిజానికి ఈ ఏడాది ఆర్సీబీ మహిళల టీమ్ డబ్ల్యూపీఎల్ గెలవడంతో తమ మెన్స్ టీమ్ కూడా ఏదో అద్భుతం చేస్తుందన్న ఆశ ఆ టీమ్ అభిమానుల్లో కనిపించింది. కానీ మొదటి నాలుగు మ్యాచ్ లలోనే వాళ్లు ఆశలు అడియాసలయ్యాయి. ముఖ్యంగా సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలోనూ ఆర్సీబీ చెత్త రికార్డు కొనసాగిస్తోంది.

ఇక్కడ వాళ్ల విజయాల శాతం కేవలం 46.51 మాత్రమే. ఈ సీజన్లో మూడు మ్యాచ్ లు ఇక్కడ ఆడగా రెండింట్లో ఓడిపోయారు. ఒక్కదాంట్లోనే గెలిచారు. అదే చెన్నై సూపర్ కింగ్స్ ను చూస్తే వాళ్ల సొంత మైదానం చెపాక్ లో ఆ టీమ్ ఏకంగా 70.96 శాతం మ్యాచ్ లు గెలిచింది. ముంబై ఇండియన్స్ వాంఖెడేలో 62.33 శాతం, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్లో 62 శాతం, నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో 57.31 శాతం విజయాలు సాధించాయి.

ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో ఒక్క కోహ్లి మాత్రమే టాపార్డర్ లో కాస్త నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్, రజత్ పటీదార్ లాంటి ప్లేయర్స్ వరుస వైఫల్యాలు ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.

IPL_Entry_Point