WPL 2024 RCB: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ-rcb vs dc royal challengers bangalore lifts wpl 2024 title smriti mandhana team won against delhi capitals in final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024 Rcb: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ

WPL 2024 RCB: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 17, 2024 11:57 PM IST

RCB vs DC WPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి తొలి టైటిల్ దక్కింది. డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్‍ను ఆర్‌సీబీ కైవసం చేసుకుంది. ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍పై ఘన విజయం సాధించి.. చాంపియన్‍గా నిలిచింది స్మృతిసేన.

WPL 2024 RCB: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ
WPL 2024 RCB: ఆర్‌సీబీ తొలి టైటిల్ సాధించెన్.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‍గా బెంగళూరు.. ఫైనల్‍లో ఢిల్లీపై సూపర్ విక్టరీ (PTI)

WPL 2024 - RCB vs DC: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆ జట్టుకు తొలి టైటిల్ దక్కింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 ఛాంపియన్‍గా ఆర్‌సీబీ అవతరించింది. ఐపీఎల్‍లో 16ఏళ్లుగా ఆర్‌సీబీ పురుషుల జట్టుకు నిరాశే ఎదురవుతుండగా.. మహిళల జట్టు మాత్రం డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‍‍లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది. నేడు (మార్చి 17) ఢిల్లీ వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍పై అలవోక విజయం సాధించింది. దీంతో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు టీమ్ ట్రోఫీ కైవసం చేసుకుంది.

ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 7 ఓవర్లలో 64 పరుగులతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ ఒక్కసారిగా ఢమాల్ అయింది. బెంగళూరు బౌలర్ సోఫీ మోలినెక్స్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‍ను మలుపు తిప్పారు. ఢిల్లీ స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అయితే, ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ నాలుగు, మోలినెక్స్ మూడు వికెట్లతో అదరగొట్టారు. ఆశా శోభన రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని 3 బంతులు మిగిల్చి గెలిచింది బెంగళూరు. 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసి విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన (31), ఎలీస్ పెర్రీ (35 నాటౌట్), సోఫీ డివైన్ (32) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు.

ఆరంభం అదుర్స్.. సడెన్‍గా ఢమాల్

ఈ డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్ షెఫాలీ వర్మ 27 బంతుల్లోనే 44 రన్స్ చేసి అదరగొట్టారు. ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (23) నిలకడగా ఆడారు. దీంతో ఓ దశలో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 64 రన్స్ చేసింది ఢిల్లీ. దీంతో అందరూ భారీ స్కోరు ఖాయమనుకున్నారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. బెంగళూరు బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ సోఫీ మోలినెక్స్ 8 ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్ (0), అలైస్ కాస్పీ (0)ని పెవిలియన్‍కు పంపారు. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. వరుసగా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. దీంతో 113 పరుగుల స్వల్ప స్కోరుకే ఢిల్లీ ఆలౌటైంది.

జాగ్రత్తగా ఛేదించిన బెంగళూరు

స్వల్ప లక్ష్యమైనా ఆచితూచి ఆడి ఛేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అనవసరమైన షాట్లకు పోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఔటయ్యాక ఎలీస్ పెర్రీ ఆ బాధ్యతను తీసుకున్నారు. చివరి వరకు నిలకడగా ఆడి నిలిచారు. రిచా ఘోష్ (17) కూడా రాణించారు. పెర్రీ, రిచా గెలుపు తీరాన్ని దాటించారు.

ఫైనల్‍లో గెలిచాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు సంబరాలుగా చేసుకున్నారు. కొందరు ప్లేయర్లు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సంతోషంలో మునిగి తేలారు.