తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: వికెట్ల వెనుక రిషబ్ పంత్ జోక్‌లు విని సిల్లీ ప్లేయర్ అనుకునేరు.. ధోనీ కంటే డేంజరస్ ప్లేయర్

Rishabh Pant: వికెట్ల వెనుక రిషబ్ పంత్ జోక్‌లు విని సిల్లీ ప్లేయర్ అనుకునేరు.. ధోనీ కంటే డేంజరస్ ప్లేయర్

Galeti Rajendra HT Telugu

11 September 2024, 16:24 IST

google News
  • Pant Test cricket: వికెట్ల వెనుక రిషబ్ పంత్ చాలా సరదాగా ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను తన మాటలతో ఆట పట్టించే పంత్.. ఆస్ట్రేలియా ప్లేయర్లని కూడా స్లెడ్జింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. అలా అని అతడ్ని సరదా ప్లేయర్ అనుకుంటే దెబ్బతింటారని పాంటింగ్ హెచ్చరించాడు. 

ధోని, రిషబ్ పంత్
ధోని, రిషబ్ పంత్ (Reuters)

ధోని, రిషబ్ పంత్

Ricky Ponting: వికెట్ల వెనుక జోక్‌లు వేస్తుండే వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సిల్లీ ఆటగాడు అనుకుంటే.. అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. గాయం నుంచి కోలుకున్న 26 ఏళ్ల రిషబ్ పంత్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ జట్టు సన్నద్ధమవుతున్న తరుణంలో గతంలో మాదిరిగానే రిషబ్ పంత్ సత్తాచాటితే.. హ్యాట్రిక్ టెస్టు సిరీస్ విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకోవడం ఖాయమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

స్టంప్ మైక్‌ దగ్గర రిషబ్ పంత్ జోక్‌లు విని.. అతను చాలా సరదా ఆటగాడని అంతా అనుకుంటారు. కానీ అలా నమ్మి మోసపోవద్దని పాంటింగ్ హెచ్చరించాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ తొలిరౌండ్ మ్యాచ్‌లో భారత్-బి తరఫున బరిలోకి దిగిన పంత్ 7, 61 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌తో వికెట్ల వెనుక నుంచి చాలా సరదాగా మాట్లాడిన పంత్.. ఔట్ అయిపో అంటూ కవ్వించాడు.

ధోనీ కంటే బెస్ట్ టెస్టు ప్లేయర్

వాస్తవానికి రిషబ్ పంత్ చాలా సీరియస్ ప్లేయర్ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఎంతలా అంటే భారత మాజీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ మొత్తంలో 90 టెస్టులాడి 6 సెంచరీలు మాత్రమే చేయగా.. రిషబ్ పంత్ కేవలం 33 టెస్టుల్లోనే 5 సెంచరీలు నమోదు చేశాడని రికీ పాంటింగ్ గుర్తుచేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు. సిడ్నీలో అతను చేసిన 97 పరుగులతో భారత్ సంచలన విజయం సాధించగా, బ్రిస్బేన్లో అజేయంగా 89 పరుగులు చేసి కంగారుల గబ్బా కోటను బద్దలు కొట్టాడు. అంతకు ముందు 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ సిడ్నీలో పంత్ చేసిన 118 పరుగులు చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్.

గాయం నుంచి కోలుకోవడంపై

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా అప్పట్లో పాంటింగ్ యాక్సిడెంట్ నుంచి పంత్ కోలుకునే వరకూ టచ్‌లోనే ఉన్నాడు. ‘‘పంత్‌ది అద్భుతమైన పునరాగమనం. అతని కాలుని, కారు ప్రమాదం సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యల గురించి విని ఐపీఎల్ 2024లో ఆడతాడని నేను అయితే అనుకోలేదు. కానీ నా గురించి ఆందోళన చెందవద్దు. నేను ఐపీఎల్‌లో ఆడతానని పంత్ హామీ ఇచ్చాడు’’ అని రికీ పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు.

వాస్తవానికి ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్‌పై భారం పడకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవాలని అనుకున్నాం. కానీ పంత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మ్యాచ్‌ల్లోనూ రెగ్యులర్‌ ప్లేయర్‌గానే ఆడాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో ఆడి.. కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలిచాడు. ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకి 16 మందితో జట్టుని భారత సెలెక్టర్లు ఎంపిక చేయగా తొలి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. తుది జట్టులోనూ పంత్ ఉండటం లాంఛనమే. అతనితో పాటు యంగ్ వికెట్ కీపర్ జురెల్‌ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు.

తదుపరి వ్యాసం