MS Dhoni: ఐపీఎల్ 2025లో చెన్నై కెప్టెన్ కోసమైనా ధోనీ ఆడాలి.. సురేశ్ రైనా రిక్వెస్ట్
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ధోనీ ఈ సీజన్‌లో ఆడతాడా లేదా అనే చర్చ మొదలైంది. గత మూడేళ్ల నుంచి ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్‌కి ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే అప్పుడే లీగ్‌లో ఆడే సీనియర్ క్రికెటర్లపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుకు సంబంధించి మెగా వేలంలో ప్లేయర్ రిటెన్షన్ పాలసీ గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. కొత్త రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఈ లెజెండరీ క్రికెటర్ రానున్న సీజన్‌లో ఆడతాడా లేదా సందేహాలు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా కితాబిచ్చాడు. దాంతో 2025లోనూ ధోనీ ఆడాలని అభిలాషిస్తూ.. ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రుతురాజ్ గైక్వాడ్ నేర్చుకోవడానికి ఇంకాస్త సమయం అవసరమని చెప్పుకొచ్చాడు.
‘‘ఐపీఎల్ 2024లో ధోనీ ఎలా బ్యాటింగ్ చేశాడో గుర్తు చేసుకుంటుంటే.. ఐపీఎల్ 2025లోనూ అతను ఆడాలని నేను కోరుకుంటున్నాను. సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరాలంటే చావోరేవో పోరులో ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ధోనీ టీమ్‌లో ఉంటేనే అతను ఆ టెక్నిక్స్ నేర్చుకోగలడు’’ అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. అయితే ఐపీఎల్ 2024కి ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. రుతురాజ్ గైక్వాడ్ చేతికి చెన్నై టీమ్ పగ్గాలు వెళ్లాయి. అయితే సీజన్‌లో తడబడిన చెన్నై టీమ్ కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది.
అంతర్జాతీయ మ్యాచ్‌లకు 5 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న వారిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కోరినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు చెన్నై యాజమాన్యం ఇష్టపడలేదు.
సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో 264 మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోనీ 5,243 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84 పరుగులు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ధోనీ.. తన కెప్టెన్సీతో చెన్నై టీమ్‌కి 2008 నుంచి ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉండిపోయిన ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 43 ఏళ్ల ధోనీని వెన్నునొప్పితో పాటు ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నా ఐపీఎల్ 2024లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కానీ.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడటంపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.