Suryakumar Yadav: బంగ్లాదేశ్‌తో సిరీస్ ముంగిట టీమిండియాకి గుడ్‌న్యూస్.. గాయం నుంచి కోలుకున్న సూర్య-india t20i captain suryakumar yadav recovers from thumb injury ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav: బంగ్లాదేశ్‌తో సిరీస్ ముంగిట టీమిండియాకి గుడ్‌న్యూస్.. గాయం నుంచి కోలుకున్న సూర్య

Suryakumar Yadav: బంగ్లాదేశ్‌తో సిరీస్ ముంగిట టీమిండియాకి గుడ్‌న్యూస్.. గాయం నుంచి కోలుకున్న సూర్య

Galeti Rajendra HT Telugu
Sep 10, 2024 12:42 PM IST

Suryakumar Yadav Injury Update: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ని భారత్ జట్టు సెప్టెంబరు 19 నుంచి ఆడనుంది. గాయం కారణంగా టెస్టులకి దూరమైన సూర్యకుమార్ యాదవ్.. టీ20లకి అందుబాటులో ఉండనున్నాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (PTI)

బంగ్లాదేశ్‌తో సిరీస్ ముంగిట టీమిండియాకి ఉత్సాహానిచ్చే వార్త. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. బంగ్లాదేశ్‌తో అక్టోబరు 6 నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఆ సిరీస్‌‌కి సూర్యకుమార్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ మేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి కూడా క్లారిటీ వచ్చింది.

ఇటీవల టీఎన్సీఏ ఎలెవన్‌తో జరిగిన బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యకుమార్ యాదవ్‌ కుడి చేతి బొటనవేలికి గాయమైంది. దాంతో ఆ మ్యాచ్‌లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ తర్వాత అతను బ్యాటింగ్ చేయలేదు.

గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ ఆడలేదు. అతను భారత్-సి జట్టు తరఫున ఆడాల్సి ఉంది. కానీ గాయంతో సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని ఎన్‌సీఏకి వెళ్లాడు.

రోజుల వ్యవధిలోనే సూర్య గాయం నుంచి కోలుకున్నాడు. ‘‘సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను దాదాపు 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చాయి.

‘‘బీసీసీఐ మెడికల్ టీం ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ గాయాన్ని అంచనా వేస్తూనే ఉంది. వచ్చే వారం ఫైనల్ చెకప్ తర్వాత దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచ్‌ల్లో అతను ఆడటంపై క్లారిటీ వస్తుంది’’ అని బీసీసీఐ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఇండియా-ఎ వర్సెస్ ఇండియా బి మ్యాచ్‌ సమయంలో చిన్నస్వామి స్టేడియంలోనే ఉన్నాడు. టీమ్ మెంబర్స్‌తో చాలా జోవియల్‌గా మాట్లాడుతూ కనిపించాడు.

దులీప్ ట్రోఫీ ద్వితీయార్థంలో సూర్య ఆడే అవకాశం ఉంది. అయితే గురువారం (సెప్టెంబర్ 12) నుంచి ప్రారంభమయ్యే రెండో రౌండ్ నుంచి బరిలోకి దిగుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. రెండో రౌండ్ నుంచే సూర్య అందుబాటులో ఉంటాడని భావించిన బీసీసీఐ భారత్- సి జట్టులో సూర్య స్థానంలో ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం.

సూర్య టెస్టు ఆశలకు దులీప్ ట్రోఫీ కీలకం

ఇండియా-బితో జరిగే తదుపరి మ్యాచ్‌లో సూర్య ఆడితే 14 నెలల తర్వాత అతడికి ఇదే తొలి రెడ్ బాల్ మ్యాచ్ అవుతుంది. గత ఏడాది దులీప్ ట్రోఫీలోనే అతను చివరి రెడ్ బాల్ మ్యాచ్ ఆడాడు.

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ.. టెస్టుల్లో రీఎంట్రీకి సూర్యకి చాలా కీలకం. టీ20ల్లో సూర్య మంచి ప్లేయర్ అయినప్పటికీ.. వన్డే, టెస్టుల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. వన్డేల్లో అతనికి పుష్కలంగా అవకాశాలు లభించినప్పటికీ 35 ఇన్నింగ్స్‌ల్లో 25 సగటుతో మాత్రమే పరుగులు చేయగలిగాడు. ఇక రెడ్ బాల్ క్రికెట్ విషయానికొస్తే గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అవకాశం వచ్చినా.. గాయం కారణంగా కేవలం ఒక టెస్టు తర్వాత అతను సిరీస్‌కి దూరమయ్యాడు.

బంగ్లాదేశ్‌తో సిరీస్ ముంగిట సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యే సన్నాహక శిబిరంలో పాల్గొనేందుకు సర్ఫరాజ్ ఖాన్ మినహా భారత టెస్టు క్రికెటర్లందరూ చెన్నైకి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీ జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కి సూర్య అందుబాటులో ఉండనున్నాడు.