Team India: టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా దక్షిణాఫ్రికా లెజెండ్?-south aftica legendary jonty rhodes to become team india next fielding coach reports ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా దక్షిణాఫ్రికా లెజెండ్?

Team India: టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా దక్షిణాఫ్రికా లెజెండ్?

Team India: టీమిండియా కోచింగ్ స్టాఫ్‍లో పూర్తిగా మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ ద్రవిడ్‍తో పాటు ఫీల్డింగ్ కోచ్ కూడా మారనున్నట్టు తెలుస్తోంది. కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎవరో రూమర్లు బయటికి వచ్చాయి.

Team India: టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా దక్షిణాఫ్రికా లెజెండ్? (HT_PRINT)

Team India: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీ ఈనెలలోనే ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత టీమిండియా హెడ్‍కోచ్ స్థానం నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. తనకు కొనసాగే ఆసక్తి లేదని ఇప్పటికే బీసీసీఐకు ద్రవిడ్ స్పష్టంగా చెప్పేశారు. అయితే, టీమిండియాకు తదుపరి హెడ్‍కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ దాదాపు ఖరారు చేసిందని తెలుస్తోంది. అయితే, సపోర్టింగ్ స్టాఫ్ కూడా తాను చెప్పిన వారే ఉండాలని గౌతీ అడిగాడట. ఈ క్రమంలో భారత్‍కు కొత్త ఫీల్డింగ్ కోచ్ రానున్నారని సమాచారం బయటికి వచ్చింది.

ఫీల్డింగ్ కోచ్‍గా రోడ్స్

దక్షిణాఫ్రికా మాజీ స్టార్, లెజెండ్ జాంటీ రోడ్స్ టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా రానున్నారని రెవ్‍స్పోర్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‍గా రోడ్స్ వ్యవహరిస్తున్నాడు.

జాంటీ రోడ్స్‌ను క్రికెట్‍లో ఆల్‍టైమ్ బెస్ట్ ఫీల్డర్‌గా పరిగణిస్తారు. దక్షిణాఫ్రికా తరఫున మెరుపు క్యాచ్‍లు, అద్భుతమైన రనౌట్లతో  రోడ్స్ ఫీల్డింగ్‍లో మెరిపించాడు. అత్యుత్తమ ఫీల్డర్ అనగానే క్రికెట్ అభిమానులు చాలా మంది రోడ్స్ పేరే చెబుతారు. అంతలా ఆయన ప్రభావం చూపాడు. కోచింగ్ కెరీర్లోనూ చాలా బిజీగా ఉన్నాడు రోడ్స్.

ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్ కోచ్‍గా టీ దిలీప్ ఉన్నారు. టీ20 ప్రపంచకప్‍తో ఆయన గడువు ముగియనుంది. దీంతో ఫీల్డింగ్ కోచ్‍గా జాంటీ రోడ్స్‌ను బీసీసీఐ నియమించనుందని తెలుస్తోంది.

అప్పుడు అప్లై చేసినా..

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్థానానికి 2019లోనే జాంటీ రోడ్స్ అప్లై చేశారు. అయితే, అప్పుడు హెడ్ కోచ్‍గా ఎంపికైన రవిశాస్త్రి.. ఆర్.శ్రీధర్‌ను తీసుకున్నాడు. 2021లో రోడ్స్ దరఖాస్తు చేసుకోలేదు. అప్పుడు దిలీప్‍ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నియమించుకున్నారు.

టీమిండియా తదుపరి హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ వస్తే కోచింగ్ స్టాఫ్‍లో పూర్తిగా మార్పులు వచ్చేలా కనిపిస్తోంది. తనకు నచ్చిన వారికి సపోర్టింగ్ కోచ్‍లుగా గౌతీ అడగనున్నాడు. ఇందులో భాగంగానే ఫీల్డింగ్ కోచ్‍గా జాంటీ రోడ్స్ రానున్నాడని తెలుస్తోంది.

కోచ్‍గా అపార అనుభవం

జాంటీ రోడ్స్‌కు ఫీల్డింగ్ కోచ్‍గా అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‍కు ఫీల్డింగ్ కోచ్‍గా ఉన్నాడు. గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) జట్టుకు పని చేశాడు. సౌతాఫ్రికా 20లీగ్ సహా మరిన్ని లీగ్‍ల్లో కోచ్‍గా చేశాడు. గతంలో శ్రీలంక ఫీల్డింగ్ కోచ్‍గానూ రోడ్స్ పని చేశాడు.

హెడ్‍కోచ్‍గా గంభీర్

టీమిండియా హెడ్ కోచ్‍గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని రిపోర్టులు బయటికి వచ్చాయి. తనకు నచ్చిన సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలని గంభీర్ అడుగగా.. ఈ డిమాండ్‍కు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. లక్నోను వీడి కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ 2024లో మెంటార్‌గా వచ్చాడు గంభీర్. తన మార్క్ దూకుడుతో కోల్‍కతాకు దిశానిర్దేశం చేశాడు. అద్భుత ఆట తీరు ప్రదర్శించిన కేకేఆర్ టైటిల్ సాధించింది. దీంతో గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ కూడా అదే రీతిలో కొనసాగుతోంది.

టీ20 ప్రపంచకప్‍లో తదుపరి సూపర్-8 ఆడనుంది భారత్. సూపర్-8లో జూన్ 20వ తేదీన అఫ్గానిస్థాన్‍తో టీమిండియా తలపడనుంది. ఈ జూన్ 29వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది.