Rishabh Pant: దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్ ఫెయిల్.. యంగ్ వికెట్ కీపర్ జురెల్‌కి లైన్ క్లియర్
India Test Squad: భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న రిషబ్ పంత్‌కి మళ్లీ నిరాశ తప్పేలా లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడిన పంత్ కేవలం 7 పరుగులే చేసి వికెట్ చేజార్చుకున్నాడు.
Duleep Trophy 2024: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి సువర్ణావకాశం చేజారింది. భారత సెలెక్టర్లను మెప్పించి టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న రిషబ్ పంత్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2024లో పేలవంగా 7 పరుగుల వద్దే ఔటైపోయాడు.
మ్యాచ్‌లో 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్ పేలవ షాట్‌తో పెవిలియన్ బాటపట్టాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత టెస్టు జట్టుని సెలెక్టర్లు ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది.
భారత టెస్టు జట్టు రేసులో రిషబ్ పంత్‌కి పోటీగా ఉన్న వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ గాయంతో దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. దాంతో రిషబ్ పంత్ కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేసి ఉన్నా.. అతను టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగుమం అయ్యేది. కానీ ఇన్నింగ్స్ 36వ ఓవర్లో బౌండరీ కోసం పెద్ద షాట్ ఆడబోయిన పంత్ పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.
రిషబ్ పంత్ ఫెయిల్యూర్‌తో యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్, సంజూ శాంసన్‌కి లైన్ క్లియరైంది. టెస్టు జట్టులోకి కీపర్‌గా ఈ ఇద్దరి పేర్లను పరిశీలించాలని టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్‌కి టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు. అలానే పంత్‌పై కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం అగార్కర్ నేతృత్వంలోని కమిటీ సెప్టెంబరు 8న 15 మందితో కూడిన టెస్టు జట్టును ఎంపిక చేయనుంది. దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టీమ్‌లోకి ఎంపికైన ఆటగాళ్లు తొలి టెస్టుకు ముందు చెన్నైలో జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొంటారు.
కారు ప్రమాదం నుంచి దాదాపు 15 నెలల కష్టపడి కోలుకున్న రిషబ్ పంత్ ఇటీవల ఐపీఎల్ 2024లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అయినప్పటికీ భారత టీ20 జట్టు, వన్డే జట్టులోనూ అతనికి అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని ఈ వికెట్ కీపర్ ఆశిస్తున్నాడు. కానీ 7 పరుగులకే ఔటైపోవడంతో మరికొన్ని రోజుల పాటు అతను నిరీక్షించక తప్పదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్ జురెల్ ఇప్పుడు టాప్ ప్రయారిటీలోకి వచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన 23 ఏళ్ల జురెల్ ఇప్పటి వరకు 3 టెస్టులాడి 63.33 సగటుతో 190 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. మిడిలార్డర్‌లో వికెట్‌ను కాపాడుకుంటూ పాటు పార్ట్‌నర్‌షిప్‌ను బిల్డ్ చేయగల జురెల్ టీమ్‌లో ఉంటే బాగుంటుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రిషబ్ పంత్ ఆట చాలా దూకుడుగా ఉంటుంది. టీ20, వన్డే తరహాలో టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో అతను గేర్లు మారుస్తుంటాడు. ఈ క్రమంలో మ్యాచ్ కీలక సమయంలోనూ పేలవంగా వికెట్ చేజార్చుకోవడం రిషబ్ పంత్‌కి అతి పెద్ద బలహీనత మారిపోయింది. ఈ బలహీనతని దిద్దుకోవాలని మాజీ క్రికెటర్లు ఎంత సూచిస్తున్నా.. పంత్ మాత్రం తన ఆటతీరుని మార్చుకోవడం లేదు.