Shikhar Dhawan Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కి శిఖర్ ధావన్ గుడ్ బై, వన్డేల్లో తిరుగులేని ఓపెనర్
Shikhar Dhawan: భారత్ తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు. ఈరోజు అతను క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. గత కొంతకాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న 38 ఏళ్ల ధావన్ ఇంటర్నేషనల్ క్రికెెట్‌కి దూరమవుతున్నప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. శిఖర్ ధావన్ చివరిసారిగా 2022, డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ తరఫున ఆడాడు.
సుదీర్ఘ కెరీర్‌లో ధావన్ 269 మ్యాచ్‌లాడి 24 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా వన్డేల్లో భారత బ్యాటింగ్ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తూ అన్ని ఫార్మాట్లలో కలిపి 10,867 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాపై సెంచరీతో వెలుగులోకి
2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ధావన్ ఆ మ్యాచ్‌లో కేవలం రెండు బంతుల్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ, 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 85 బంతుల్లోనే సెంచరీ బాదేసి టెస్టుల్లోకి తన అరంగేట్రాన్ని ప్రపంచానికి చాటాడు.
‘‘నా టెస్టు అరంగేట్రంలో చేసిన సెంచరీ.. నా ఫేవరెట్. భారత్ తరఫున ఆడి ప్రపంచ రికార్డులు సృష్టించాలని కలలు కనేవాడిని. ఆ సెంచరీతో టెస్టు జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అప్పట్లో చాలా సంతోషంగా అనిపించింది’’ అని ధావన్ అన్నాడు.
రోహిత్ శర్మకి సరిజోడి
టెస్టుల్లో ధావన్ అద్భుత ఆరంభం అతని వన్డే పునరాగమనానికి కూడా మార్గం సుగమం చేసింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్, రోహిత్ శర్మ రూపంలో సరికొత్త ఓపెనింగ్ జోడీని అప్పటి కెప్టెన్ ధోనీ తెరపైకి తెచ్చాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై ధావన్ వరుస సెంచరీలు చేశాడు. ఆ ట్రోఫీలో 363 పరుగులు చేసిన ధావన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుని, భారత్‌కి టైటిల్ అందించాడు.
ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా ధావన్ నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 51.5 సగటుతో 412 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికాపై అతను చేసిన 137 పరుగులు కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ధావన్ 338 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత వన్డేల్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ధావన్, రోహిత్ శర్మ నిలిచారు. రోహిత్, ధావన్ 115 ఇన్నింగ్స్‌ల్లో 45.55 సగటుతో 18 సెంచరీలతో 5148 పరుగులు చేసింది.
వెంటాడిన బ్యాడ్‌లక్
2019 ప్రపంచకప్‌లోనూ ధావన్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తూ బొటనవేలు విరగడంతో టోర్నీకి దూరమ్యాడు. కెరీర్‌లో ధావన్‌కు అదే చివరి ఐసీసీ టోర్నమెంట్. గాయం నొప్పిని భరిస్తూ ఆస్ట్రేలియాపై అతను చేసిన 117 పరుగులు ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ఇంగ్లాండ్‌పై 98, వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసినా సెంచరీని అందుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్ రేట్ తగ్గడంతో ధావన్ ఒత్తిడికి గురయ్యాడు. 2021 జూలైలో తర్వాత అతను మళ్లీ ఇంటర్నేషనల్ టీ20ల్లో ఆడలేకపోయాడు.
ధావన్ ఆడిన చివరి టీ20 ఇన్నింగ్స్‌ల్లో 52, 52, 46, 40 పరుగులు చేశాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ స్లో స్ట్రైక్ రేట్‌ను చూపిస్తూ టీమ్ నుంచి తప్పించింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ధావన్ వరుసగా 618, 587 పరుగులతో సత్తాచాటాడు.