Suryakumar Yadav: టెస్టు టీమ్‌లోకి తిరిగి వస్తా.. మూడు ఫార్మాట్లూ ఆడతా: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాను మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. టెస్టు క్రికెట్ కు కూడా తాను తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
Suryakumar Yadav: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం ప్రారంభం కాగానే.. భారత జట్టుకు పూర్తిస్థాయి టీ20 కెప్టెన్ గా ఎదిగిన సూర్యకుమార్ యాదవ్.. ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్ ను 3-0తో వైట్‌వాష్ చేసిన భారత జట్టును సూర్యకుమార్ నడిపించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తోనే కోచ్ గా గంభీర్, కెప్టెన్ సూర్య శకం మొదలైంది.
మూడు ఫార్మాట్లూ ఆడతా: సూర్యకుమార్
భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వచ్చిన గంభీర్.. టీ20 కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు డిప్యూటీగా సేవలందించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను సూర్యకుమార్ వెనక్కి నెట్టాడు.
హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. భారత జట్టు సూర్యకుమార్ ను టీ20 కెప్టెన్ గా ఎంపిక చేసింది. తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడని సూర్యకుమార్.. ఇప్పుడు బుధవారం (ఆగస్ట్ 13) బుచ్చిబాబు ఇన్విటేషనల్ మల్టీ డే టోర్నమెంట్లో ముంబై తరఫున ఒక మ్యాచ్ ఆడేందుకు అందుబాటులో ఉన్నానని చెప్పాడు.
ఇందులో ఆడటం వల్ల రెడ్ బాల్ క్రికెట్ కు చేరువై మరోసారి టెస్టు క్రికెట్ లోకి తిరిగి రావాలని భావిస్తున్నట్లు సూర్య తెలిపాడు.
టెస్టు క్రికెట్‌లోకి తిరిగొస్తా: సూర్య
సూర్యకుమార్ 2023లో భారత్ తరఫున ఒకే ఒక్క టెస్టు ఆడాడు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ సీనియర్ బ్యాట్స్ మన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో అతడు 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇండియన్ టీమ్ మాత్రం ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మధ్యే సూర్య టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. “నేను ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని అనుకుంటున్నాను. ఈ సీజన్లో రెడ్ బాల్ టోర్నమెంట్ల కోసం నాకు బుచ్చి బాబు టోర్నీ మంచి ప్రాక్టీస్ ఇస్తుంది” అని సూర్య అన్నాడు.
అటు ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ కూడా ముంబై జట్టుకు సూర్య ఆడుతుండటంపై స్పందించాడు. "బుచ్చిబాబు టోర్నమెంట్లో ఆడాలనుకుంటున్నానని, రెండో మ్యాచ్ (ఆగస్టు 27 నుంచి 30 వరకు ఇదే వేదికపై టీఎన్సీఏ ఎలెవన్) నుంచి అందుబాటులో ఉంటానని సూర్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇది ముంబైకి పెద్ద ప్లస్ పాయింట్.
అతని నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని సంజయ్ పాటిల్ అన్నాడు. సౌరవ్ గంగూలీ నుంచి మహ్మద్ అజారుద్దీన్ వరకు పలువురు గతంలో ఈ టోర్నీలో పాల్గొన్నారు. సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో ముంబై జట్టుకు సూర్య ఆడనున్నాడు.