తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar Loses Cool: టీమ్ నచ్చకపోతే మ్యాచ్‌లు చూడకండి.. గవాస్కర్ సీరియస్.. టీవీ డిబేట్‌లో సహనం కోల్పోయిన మాజీ కెప్టెన్

Gavaskar loses cool: టీమ్ నచ్చకపోతే మ్యాచ్‌లు చూడకండి.. గవాస్కర్ సీరియస్.. టీవీ డిబేట్‌లో సహనం కోల్పోయిన మాజీ కెప్టెన్

Hari Prasad S HT Telugu

22 August 2023, 14:38 IST

google News
    • Gavaskar loses cool: నచ్చకపోతే మ్యాచ్ చూడకండి అంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. ఆసియాకప టీమ్ ఎంపికపై ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడిన సన్నీ.. సహనం కోల్పోయాడు.
ఆసియా కప్ టీమ్ ఎంపికపై మాట్లాడుతూ సహనం కోల్పోయిన గవాస్కర్
ఆసియా కప్ టీమ్ ఎంపికపై మాట్లాడుతూ సహనం కోల్పోయిన గవాస్కర్

ఆసియా కప్ టీమ్ ఎంపికపై మాట్లాడుతూ సహనం కోల్పోయిన గవాస్కర్

Gavaskar loses cool: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సహనం కోల్పోయాడు. టీవీ డిబేట్ లో మాట్లాడుతూ.. అశ్విన్ గురించి ఓ యూజర్ అడిగిన ప్రశ్నపై సన్నీ సీరియస్ అయ్యాడు. ఆసియా కప్ జట్టులోకి అశ్విన్ ను ఎందుకు ఎంపిక చేయలేదు అని అడిగిన ప్రశ్నపై గవాస్కర్ చాలా అసహనం వ్యక్తం చేశాడు. నచ్చకపోతే మ్యాచ్ చూడకండి అంటూ మండిపడటం గమనార్హం.

"కొందరు ప్లేయర్స్ అదృష్టవంతులని చెప్పొచ్చు. కానీ టీమ్ ఎంపికైంది. అందువల్ల అశ్విన్ గురించి మాట్లాడొద్దు. వివాదాలు క్రియేట్ చేయడం ఆపండి. ఇది మన టీమ్. మీకు నచ్చకపోతే మ్యాచ్ లు చూడకండి. కానీ అతన్ని ఎంపిక చేయాల్సింది. ఇతన్ని ఎంపిక చేయాల్సింది అనేది తప్పు. ఇది మన తప్పుడు మైండ్‌సెట్" అని ఆజ్‌తక్ టీవీతో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.

ఇక చహల్, సంజూ శాంసన్ లపై కూడా గవాస్కర్ స్పందించాడు. "ఏ ప్లేయర్ కూడా అన్యాయం జరిగిందని చెప్పకూడదు. మరి ఇంకా ఎవరిని ఎంపిక చేయాలి? ఈ టీమ్ వరల్డ్ కప్ గెలవగలదు. అనుభవం ఉన్న, ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ 17 మందిని ఆసియా కప్ జట్టులోకి ఎంపిక చేశారు" అని గవాస్కర్ స్పష్టం చేశాడు. ఇప్పటికీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రాహుల్ ఎంపికను కూడా గవాస్కర్ సమర్థించాడు.

"చూద్దాం అతని గాయం ఎలాంటిదో. ఆసియా కప్ గెలవడం ముఖ్యమే కానీ వరల్డ్ కప్ అసలు టార్గెట్. అందువల్ల రాహుల్ ను వరల్డ్ కప్ జట్టులోకి కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే అతన్ని ఆసియా కప్ జట్టులోకి ఎంపిక చేసి మంచి పని చేశారు. ఇండియా విషయానికి వస్తే మరో 11 రోజులు ఉన్నాయి. గాయం నుంచి కోలుకోవడానికి ఆ సమయం చాలు. సెప్టెంబర్ రెండో వారం వరకూ మరిన్ని మ్యాచ్ లు కూడా ఉన్నాయి. రాహుల్ కు ఒక అవకాశం ఇవ్వడం సరైనదే. గతంలో అతడు ఇండియన్ టీమ్ కు చేసింది చూస్తే కోలుకోవడానికి అవకాశం ఇవ్వడం కరెక్టే" అని గవాస్కర్ అన్నాడు.

ఈ టీమ్ ఆసియా కప్, వరల్డ్ కప్ గెలిచే అవకాశాలపై కూడా గవాస్కర్ స్పందించాడు. "ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన టీమ్ చాలా మంచి టీమ్. ఈ జట్టు నుంచే వరల్డ్ కప్ కోసం 15 మందిని తీసుకోవాలి. ఇండియాకు ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రతి మ్యాచ్ గెలవడానికే ప్రయత్నించాలి. ఆసియా కప్ పెద్ద టోర్నమెంట్. కానీ వరల్డ్ కప్ గెలవడం పూర్తిగా భిన్నమైనది. దానిని ఆసియా కప్ విజయంతో భర్తీ చేయలేం. అందుకే పెద్ద లక్ష్యాన్ని చూడాలి. ఆసియా కప్ గెలిస్తే మంచిదే. కానీ అసలు లక్ష్యం వరల్డ్ కప్ కావాలి" అని గవాస్కర్ అన్నాడు.

తదుపరి వ్యాసం