Gavaskar on Team India: జిమ్‌లో బరువులెత్తడం కాదు.. క్రికెట్ ఆడండి: ప్లేయర్స్‌కు గవాస్కర్ చురక-cricket news in telugu gavaskar slams team india bowlers ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Team India: జిమ్‌లో బరువులెత్తడం కాదు.. క్రికెట్ ఆడండి: ప్లేయర్స్‌కు గవాస్కర్ చురక

Gavaskar on Team India: జిమ్‌లో బరువులెత్తడం కాదు.. క్రికెట్ ఆడండి: ప్లేయర్స్‌కు గవాస్కర్ చురక

Hari Prasad S HT Telugu
Aug 21, 2023 05:12 PM IST

Gavaskar on Team India: జిమ్‌లో బరువులెత్తడం కాదు.. క్రికెట్ ఆడండి అంటూ టీమిండియా ప్లేయర్స్‌కు గవాస్కర్ చురకలంటించాడు. నిజానికి జిమ్ లో అవసరానికి మించి బరువులు ఎత్తడం వల్లే ప్లేయర్స్ గాయపడుతున్నారని సన్నీ అనడం గమనార్హం.

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ (Getty/PTI)

Gavaskar on Team India: ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ప్రధానంగా బౌలర్లు ఎక్కువగా గాయపడుతుండటంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. జిమ్ లో అవసరానికి మించి బరువులు ఎత్తడం వల్లే వాళ్లు ఇలా గాయపడుతున్నారని విమర్శించాడు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలాంటి ప్లేయర్స్ ఇలా గాయపడే చాలా రోజుల తర్వాత టీమ్ లోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

11 నెలలుగా బుమ్రా, ఏడాది కాలంగా ప్రసిద్ధ్ జట్టుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆసియాకప్ జట్టులో ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. దీనిపై ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ స్పందించాడు. "ఈ గాయాలన్నీ చూస్తే.. బరువులు ఎత్తడానికి ప్రయత్నించినప్పుడే గాయాలయ్యాయి. నేను ఇందులో నిపుణుడిని కాదు.

నేను చెప్పేది తప్పు కూడా కావచ్చు కానీ వాళ్లు అవసరమైనదాని కంటే ఎక్కువగానే బరువులు ఎత్తుతున్నారు. అది మీ క్రికెట్ కు ఏమాత్రం తోడ్పడదు. గతంలో ఇలా జరగలేదు. గతంలో బౌలర్లకు ఈ స్థాయిలో వెన్ను గాయాలు కాలేదు" అని గవాస్కర్ అన్నాడు.

"క్రికెటింగ్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. ప్రస్తుతం ఫ్రాంఛైజీల్లో బయో మెకానిక్స్ నిపుణులు ఏం చేస్తున్నారో చూసి అదే ఇండియన్ టీమ్ లోనూ చేసేలా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చూడాలి. క్రికెట్ ఫిట్ గా ఉండటం ముఖ్యం. ట్రెడ్‌మిల్ పై ఎన్ని మైళ్లు పరుగెత్తారన్నది ముఖ్యం కాదు. క్రికెట్ ఫీల్డ్ లో బంతితో ఎంత పరిగెత్తారన్నది చూడాలి" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

ఆసియా కప్ కోసం సోమవారం (ఆగస్ట్ 21) సెలక్టర్లు జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న బలమైన జట్టునే ఎంపిక చేశారు. రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా గాయాల నుంచి కోలుకొని తిరిగి వచ్చారు. రాహుల్ ఫిట్‌నెస్ పై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాకపోవడంతో రిజర్వ్ ప్లేయర్ గా సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Whats_app_banner