Gavaskar on Team India: కీలకమైన ఆసియా కప్, వరల్డ్ కప్ టోర్నీలకు ముందు వెస్టిండీస్ చేతిలో ఇండియా టీ20 సిరీస్ ఓడిపోవడం ఎవరికీ మింగుడు పడటం లేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లకు కనీసం అర్హత సాధించని వెస్టిండీస్ పై కూడా గెలవలేని పరిస్థితుల్లో మన టీమ్ ఉందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇక మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే తన విమర్శలకు పదును పెట్టాడు. క్రమంగా యువ ప్లేయర్స్ చేతుల్లోకి వెళ్తున్న టీమిండియాలో.. ఆ ప్లేయర్స్ ఎదుర్కోబోయే సవాళ్ల గురించి అతడు స్పందించాడు. పిల్లలతో కాదు.. మగాళ్లతో ఆడినప్పుడే అసలు సత్తా ఏంటో తెలుస్తుందని సన్నీ అనడం గమనార్హం. ఫ్రాంఛైజీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ కు చాలా తేడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా అతడు అన్నాడు.
"ఓ ప్లేయర్ ఫ్రాంఛైజీ స్థాయిలో బాగానే ఆడుతుండొచ్చు. కానీ దేశం కోసం ఆడినప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లపై ఉండే ఒత్తిళ్లు, అంచనాలు మరో లెవల్లో ఉంటాయి. ఈ స్థాయిలో ఫ్రాంఛైజీ క్రికెట్ అత్యుత్తమ ఆటగాళ్లు కూడా తడబడుతుంటారు. అండర్ 19లో ఇరగదీసిన యువ ఆటగాళ్లు పురుషుల క్రికెట్ లో విఫలమవడం ఎన్నిసార్లు చూడలేదు" అని స్పోర్ట్స్‌స్టార్ కు రాసిన కాలమ్ లో గవాస్కర్ అన్నాడు.
అయితే సన్నీ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. "పిల్లలు పిల్లలతో ఆడినప్పుడు బాగానే అనిపిస్తారు. కానీ మగాళ్లతో ఆడినప్పుడే తడబడతారు. అండర్ 19 క్రికెట్ లో ఓ కేకులా అనిపించింది కూడా ఇక్కడ బురదలాగా కనిపిస్తుంది. అందుకే బాయ్స్ క్రికెట్ లో రాణించిన ఎంతో మంది మెన్స్ క్రికెట్ లో విఫలమయ్యారు.
ఫ్రాంఛైజీ లెవల్లో అవసరమైన నైపుణ్యం చాలా తక్కువగా ఉంటుంది. కోట్లు పెట్టి ఫ్రాంఛైజీలు తమను కొనుగోలు చేయడంతో ఈ యువకులు ఎలాగైనా రాణించాలన్న కసి కోల్పోతారు. ఆ తర్వాత తమ ఆట పతనమైనా అవే ఫ్రాంఛైజీలకు తక్కువ మొత్తాలకు కూడా కాంట్రాక్ట్ పై సంతకాలు చేస్తారు" అని గవాస్కర్ అన్నాడు.
నిజానికి ఈ సమయంలో సన్నీ ఇలాంటి కామెంట్స్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. వెస్టిండీస్ టూర్ కు ఎంపికైన ఐపీఎల్ స్టార్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ చాలా బాగా రాణించారు. ఒక్క సంజూ శాంసన్ మాత్రమే పదేపదే తనకు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడు.