Tilak Varma : ఎన్నాళ్లకెన్నాళ్లకు ఒక్కడొచ్చాడు.. టీమిండియా ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న ఆటగాడు
Tilak Varma : ప్రస్తుతం భారత క్రికెట్‌లో మరో ఆశాజనకమైన పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 20 ఏళ్ల క్రికెటర్ చాలా బాగా ఆడాడు. అందరి దృష్టిని ఆకర్శించాడు.
తిలక్ వర్మ ఆడిన తొలి మ్యాచ్ లోనే 22 బంతుల్లో 39 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో T20 మ్యాచ్‌లో, అతను 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతర్జాతీయ T20 మ్యాచ్‌లో తన మొదటి ఫిఫ్టీని సాధించాడు, మూడో T20 మ్యాచ్‌లో అజేయంగా 49 పరుగులు చేశాడు. 5వ వన్డేలోనూ 27 పరుగులు చేసి తన బౌలింగ్‌లో రెండో బంతికే వికెట్‌తో మెరిశాడు.
5 మ్యాచ్‌లలో 140.65 స్ట్రైక్ రేట్‌తో 57.67 సగటుతో 173 పరుగులు చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు తిలక్. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన ఆటతీరు చూపెట్టాడు. ఈ యువ బ్యాట్స్‌మన్ ఇప్పుడు భారత జట్టుకు భవిష్యత్తు ఆటగాడిగా నమ్ముతున్నారు.
నాలుగైదేళ్లుగా భారత జట్టు ఓ లోటుతో బాధపడుతోంది. అది నాలుగో నంబర్ ఆటగాడి సమస్య. చాలా ఏళ్లుగా భారత జట్టుకు ఈ క్రమంలో సరిపోయే ఆటగాడు లభించలేదు. వచ్చినవారు.. కంటిన్యూగా మంచి ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను ఆడించినా ఎవరినీ ఖరారు చేయలేదు.
నాలుగో ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు వరుసగా అవకాశాలు లభించినా పరుగులేమీ చేయలేదు. నాలుగో నంబర్‌లో ఎవరు ఆడాలనే విషయంలో భారత జట్టు ఇంకా అయోమయంలో ఉంది. ఆ సమస్యకు ఇప్పుడు తిలక్ వర్మ పరిష్కారం చూపుతున్నాడు.
ఆసియా కప్, ప్రపంచకప్‌లు వస్తున్నాయి. తిలక్ వర్మ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. వెస్టిండీస్‌పై అతని ప్రదర్శన చూసిన తర్వాత, వీలైనంత త్వరగా వన్డే క్రికెట్ ఆడతాడనడంలో సందేహం లేదు. ఆసియా కప్, ప్రపంచ కప్ జట్టుకు మిగిలి ఉన్న ఏకైక సమస్య మిడిల్ ఆర్డర్ ఆటగాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి రావడం ఖాయం. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పుడు వర్మ ఎంపిక కఠినంగా ఉంటుంది.
తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు. అద్భుతమైన ఫీల్డర్, పార్ట్ టైమ్ బౌలర్ కూడా. అన్నింటికంటే మించి అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. రిషబ్ పంత్ లేకపోవడంతో, ఆసియా కప్, ప్రపంచకప్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వర్మ మంచి ఎంపిక కావచ్చు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల గాయం పరిస్థితిని పరిశీలిస్తే 18 మంది సభ్యులతో కూడిన జట్టులో తిలక్ వర్మ పేరు రావడంలో ఆశ్చర్యం లేదు.