Ashwin on World Cup: మాపై ఒత్తిడి పెంచడానికే ఇండియా ఫేవరెట్స్ అంటున్నారు.. ఆస్ట్రేలియానే ఫేవరెట్: అశ్విన్
Ashwin on World Cup: మాపై ఒత్తిడి పెంచడానికే ఇండియా ఫేవరెట్స్ అంటున్నారు.. ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని వరల్డ్ కప్ పై స్పిన్నర్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Ashwin on World Cup: ఐసీసీకి సంబంధించి ఏ మెగా టోర్నీ జరిగినా ఫేవరెట్స్ లో ఒకటిగా ఇండియాను పరిగణిస్తారు. ఈసారి వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుండటంతో ఈ టోర్నీలో ఇండియానే ఫేవరెట్స్ అని ఇప్పటికే అందరు క్రికెట్ పండితులు, ఇతర దేశాల మాజీ క్రికెటర్లు తేల్చేశారు. అయితే స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇది తమపై ఒత్తిడి పెంచే వ్యూహం అని అనడం విశేషం.
అంతేకాదు ఆస్ట్రేలియా ఫేవరెట్స్ అని, వాళ్లను తక్కువ అంచనా వేయలేమని అశ్విన్ అన్నాడు. "వన్డే వరల్డ్ కప్ గురించి చెప్పాలంటే.. ఆస్ట్రేలియా ఫేవరెట్స్ లో ఒకటి. నాకు తెలుసు క్రికెట్ ప్రపంచంలో అందరూ ఇండియానే ఫేవరెట్స్ అంటున్నారు. నిజానికి ప్రపంచంలోని క్రికెటర్లందరూ దీనినొక వ్యూహంగా మార్చుకొని ప్రతి ఐసీసీ ఈవెంట్ కు ముందు ఇండియా ఫేవరెట్స్ అని అంటుంటారు.
తమపై ఒత్తిడి తగ్గించుకొని, ఇండియాపై అదనపు ఒత్తిడి పెంచడానికి ఇదొక వ్యూహం. ఇండియా కూడా ఫేవరెట్స్ లో ఒకటి కావచ్చు కానీ ఆస్ట్రేలియా కూడా ఓ పవర్ హౌజ్ టీమ్" అని తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ అన్నాడు.
మరోవైపు ఇప్పటికే ఆస్ట్రేలియా 18 మందితో కూడిన తమ వరల్డ్ కప్ ప్రాథమిక టీమ్ ను కూడా అనౌన్స్ చేయడం విశేషం. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా.. చివరిసారి 2015లో తమ స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 18 మంది నుంచే 15 మంది టీమ్ ను వరల్డ్ కప్ తోపాటు ఇండియా టూర్ కు కూడా ఆస్ట్రేలియా పంపనుంది.
ఇక అశ్విన్ విషయానికి వస్తే తొలిసారి వరల్డ్ కప్ కు దూరమైన వెస్టిండీస్ టీమ్ పై కూడా స్పందించాడు. "ఒక దశలో క్రికెట్ పవర్ హౌజ్ గా వెస్టిండీస్ ఉండేది. ఏదో టైంపాస్ లాగా వచ్చి 1975, 1979 వరల్డ్ కప్ లను గెలిచేశారు. 1983 వరల్డ్ కప్ లోనూ ఫేవరెట్స్ గానే దిగారు. కానీ ఇండియా గెలిచింది.
ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ ను కళ్లు చెదిరే రీతిలో ఒడిసి పట్టుకున్న కపిల్ దేవ్ కు ఆ ఘనత దక్కుతుంది. అటు గార్డన్ గ్రీనిడ్జ్ ను బల్విందర్ సింగ్ సంధూ అద్భుతమైన బాల్ తో బౌల్డ్ చేశాడు. ఆ వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పతనమవుతూ వచ్చింది. 1983 వరల్డ్ కప్ తర్వాత 1987లోనూ ఇండియా దగ్గరగా వచ్చింది. అయితే అక్కడి నుంచి ఆస్ట్రేలియా కొత్త పవర్ హౌజ్ గా అవతరించింది. అప్పటి నుంచీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది" అని అశ్విన్ అన్నాడు.
సంబంధిత కథనం