ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మనిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెటర్లు వీళ్లే!
17 May 2024, 9:11 IST
ipl 2024: ఐపీఎల్ 2024లో కోట్లు పెట్టి కొన్న కొందరు క్రికెటర్లు దారుణంగా నిరాశపరిచారు. తమ ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేక చతికిలా పడ్డారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
ఐపీఎల్ 2024
ipl 2024: ఐపీఎల్ 2024లో అంచనాలకు మించి సాగింది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగిన ముంబై లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఎవరూ ఊహించని విధంగా కోల్‌కతా, రాజస్థాన్ అదిరిపోయే ఆటతీరుతో దూసుకుపోయాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో యంగ్ క్రికెటర్లు కుమ్మేశారు. అనామకులుగా బరిలో దిగి సంచలనాలు సృష్టించారు. మరోవైపు వేలంలో కోట్లు ధర పలికిన కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం తుస్ మనిపించారు. తమ ధరకు తగ్గ ఆటతీరు కనబరచలేక నిరాశపరిచారు.ఆ స్టార్ క్రికెటర్లు ఎవరంటే?
అల్జారీ జోసెఫ్...
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను 11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్నది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన వెస్టిండీస్ క్రికెటర్లలో ఒకరిగా అల్జారీ జోసెఫ్ నిలిచాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అల్జారీ జోసెఫ్ కేవలం ఒకే ఒక వికెట్ తీసి దారుణంగా నిరాశపరిచాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అతడిని బెంగళూరు మేనేజ్‌మెంట్ పక్కనపెట్టేసింది.
స్పెన్సర్ జాన్సన్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్పెన్సర్ జాన్సన్‌ను గుజరాత్ టైటాన్స్ పది కోట్లకు కొన్నది. బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన జాన్సన్ ఐపీఎల్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన జాన్సన్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.
సమీర్ రిజ్వీ...
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లకు సొంతం చేసుకున్నది. ఐపీఎల్ వేలంలో కేవలం 20 లక్షల బేస్ ధరతో ఎంట్రీ ఇచ్చిన అతడిని చెన్నై భారీ ధరకు కొనుగోలు చేయడంతో అందరి దృష్టి సమీర్ రిజ్వీపై పడింది. ఎనిమిది కోట్ల కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు సమీర్ రిజ్వీ. ఎనిమిది మ్యాచుల్లో కలిపి కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 21 పరుగులు మాత్రమే.
రోమన్ పావెల్…
వెస్టిండీస్ హిట్టర్ రోమన్ పావెల్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏడు కోట్ల నలభై లక్షలకు ఐపీఎల్ వేలంలో పోటీపడి కొన్నది. గత సీజన్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ హిట్టర్ ఈ సారి మాత్రం తుస్‌మన్నాడు. ఏడు మ్యాచుల్లో పదహారు యావరేజ్‌తో 81 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో రాజస్థాన్ అతడిని పక్కనపెట్టేసింది.
షారుఖ్‌ఖాన్...
డొమెస్టిక్ క్రికెట్‌లో హిట్టింగ్‌కు మారుపేరుగా నిలిచిన షారుఖ్‌ఖాన్ ఐపీఎల్‌లో మాత్రం పరుగులు చేయడానికే చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏడు మ్యాచుల్లో కలిపి 127 రన్స్ చేశాడు.
వీరితో పాటు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కూడా తమ ధరకు తగ్గట్లుగా ఆడలేకపోయారనే విమర్శలొచ్చాయి.