తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tech Mahindra Q2 Results: టెక్ మహీంద్రా లాభంలో తగ్గుదల.. షేర్‌కు 18 డివిడెండ్

Tech Mahindra Q2 results: టెక్ మహీంద్రా లాభంలో తగ్గుదల.. షేర్‌కు 18 డివిడెండ్

HT Telugu Desk HT Telugu

01 November 2022, 16:08 IST

    • Tech Mahindra Q2 results: క్రితం త్రైమాసికంతో పోల్చితే 13.6 శాతం లాభపడ్డప్పటికీ.. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చితే టెక్ మహీంద్రా లాభాలు తగ్గాయి. 
రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా
రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా (Bloomberg)

రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా

Tech Mahindra Q2 results: దేశంలోనే ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా నికర లాభం గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 4 శాతం తగ్గింది. టెక్ మహీంద్రా కంపెనీ ఈమేరకు మంగళవారం సెప్టెంబరు 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. పన్ను అనంతర లాభం (పీఏటీ) 4 శాతం తగ్గి రూ. 1,285.4 కోట్లుగా నమోదు చేసినట్టు వెల్లడించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 1,338.7 కోట్ల లాభాలు ఆర్జించింది.

అయితే ఈ ఏడాది జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసికంతో పోల్చితే టెక్ మహీంద్రా లాభం 13.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో లాభం రూ. 1,131.6 కోట్లుగా చూపింది.

షేరు ఒక్కటింకి రూ. 18 చొప్పున ప్రత్యేక డివిడెంట్‌ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ క్వార్టర్‌లో ఆదాయం 20.6 శాతం పెరిగి రూ. 13,129.50 కోట్లుగా చూపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 10.881.30 కోట్లుగా ఉంది.

‘మా ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములు, సమాజానికి దీర్ఘకాలంలో అదనపు విలువ సమకూర్చేందుకు మేం కృత నిశ్చయంతో చురుగ్గా ముందుకు సాగుతున్నాం. సరఫరా అంతరాలతో కూడిన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ మా సమీకృత, నూతన తరం పరిష్కారాలతో మా కస్టమర్ల పరివర్తన ప్రయాణానికి సహకరిస్తాం..’ అని టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నానీ వివరించారు.

టెక్ మహీంద్రా షేర్లు మంగళవారం 0.43 శాతం పెరిగి రూ. 1,067.95 వద్ద ట్రేడయ్యాయి. 2022లో టెక్ మహీంద్రా షేర్లు దాదాపు 40.42 శాతం పతనమయ్యాయి. ఆర్థిక మాంద్య భయాల కారణంగా ఐటీ స్టాక్స్ అన్నీ పతనం చవిచూశాయి.