తెలుగు న్యూస్  /  Business  /  Tata Motors Q2 Results Firm Sees Higher Than Expected Net Loss Of 945 Crore Rupees

Tata Motors Q2 Results: టాటా మోటార్స్ నికర నష్టం రూ. 944 కోట్లు

HT Telugu Desk HT Telugu

09 November 2022, 17:13 IST

    • టాటా మోటార్స్ క్యూ2లో రూ. 944 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది.
రూ. 944 కోట్ల నష్టాలను చూపిన టాటా మోటార్స్
రూ. 944 కోట్ల నష్టాలను చూపిన టాటా మోటార్స్ (Bloomberg)

రూ. 944 కోట్ల నష్టాలను చూపిన టాటా మోటార్స్

ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2ఎఫ్‌వై23)లో రూ. 944.61 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం సంవత్సరం (క్యూ2ఎఫ్‌వై22)లో కంపెనీ రూ. 4,441.57 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 29.7% పెరిగి రూ. 79,611.37 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 61,378.82 కోట్లుగా ఉంది. కాగా ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన టాటా మోటార్స్ కంపెనీ ఎబిటా మార్జిన్ 9.7 శాతానికి మెరుగుపడింది.

విశ్లేషకులు ఈ త్రైమాసికంలో 6% నుంచి 12.6% మధ్య రాబడి వృద్ధిని అంచనా వేశారు. నష్టాలు దాదాపు 87% తగ్గుతాయని, లేదా లాభాలు స్వల్పంగా పెరుగుతాయని అంచనా వేశారు. ఏకీకృత ఆదాయం రూ. 76,188 కోట్ల నుంచి రూ. 80,927 కోట్ల మధ్య ఉంటుందని, నికర నష్టాలు రూ. 775.5 కోట్లకు తగ్గుతాయని లేదా నికర లాభాలు రూ. 324 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు.

కాగా జేఎల్ఆర్ ఆదాయం Q2FY23లో 5.3 బిలియన్‌ యూరోలుగా ఉంది. Q2FY22 నుండి 36% మేర పెరిగింది. జేఎల్ఆర్ చిప్ సరఫరాదారులతో దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయడంపై దృష్టి సారిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ బోలోరే మాట్లాడుతూ, ‘సెమీకండక్టర్ పరిమితులు కొనసాగుతున్నప్పటికీ, మా కొత్త రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ ఉత్పత్తి పెరగడం, ఆదాయం, మార్జిన్‌, క్యాష్ ఫ్లో మెరుగుపరుచుకోవడంతో మేం రెండో త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరును అందించాం..’ అని వివరించారు.

‘మా వాహనాలకు డిమాండ్ బలంగా ఉంది. సెమీకండక్టర్ భాగస్వాములతో కొత్త ఒప్పందాలు అమలులోకి రావడం వల్ల మా క్లయింట్లకు వాహనాలను డెలివరీ మెరుగవుతుంది. ద్వితీయార్థంలో మా పనితీరును మెరుగుపరచడం కొనసాగించాలని భావిస్తున్నాం..’ అని బోలోరే చెప్పారు.

టాటా వాణిజ్య వాహనాల విభాగం క్యూ2 ఎఫ్‌వై22లో అమ్మకాల్లో 15% వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణీకుల వాహనాల విభాగం 69% వృద్ధిని నమోదు చేసింది.