Stock market: బడ్జెట్ ఎఫెక్ట్; వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్
24 July 2024, 17:37 IST
Stock market today: స్టాక్ మార్కెట్ బుధవారం కూడా నష్టాల్లో ముగిసింది. బడ్జెట్ ప్రభావంతో మంగళవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్.. వరుసగా రెండో రోజూ నష్టాలనే చవి చూసింది. అంతేకాదు, మార్కెట్ నష్టాలతో ముగియడం ఇది వరుసగా నాలుగో రోజు. బుధవారం సెన్సెక్స్ 280 పాయింట్లు,నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయాయి.
వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్
Stock market today: మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు ఆరోగ్యకరమైన లాభాలను నమోదు చేసినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా నాలుగో సెషన్లో కూడా తమ నష్టాల పరంపరను కొనసాగించాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 80,148.88 వద్ద ముగియగా, నిఫ్టీ 66 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 24,413.50 వద్ద ముగిసింది.
ఈ పతనానికి కారణం బడ్జెటేనా?
బెంచ్ మార్క్ సూచీల పతనానికి ఎంపిక చేసిన బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణం కావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, బడ్జెట్ లో ఆర్థికమంత్రి ప్రకటించిన పన్ను రేట్ల పెంపు కూడా మరో కారణమని వివరిస్తున్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుల పెంపు స్వల్పకాలం మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫారిన్ ఫండ్స్ వెనక్కు వెళ్లడం కూడా కొంత మేరకు ప్రభావం చూపిందని తెలిపారు. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు
‘‘బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కొనసాగడం కీలక బెంచ్ మార్క్ సూచీల పతనానికి దారితీసింది. అయితే, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఎంపిక చేసిన కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు కనిష్టాలను ముగించాయి’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ విపి (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు.
మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు
మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు బెంచ్ మార్క్ లను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.91 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో లాభాల కారణంగా బీఎస్ఈలో లిస్టైన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు రూ.446.4 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.449.6 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్ (budget 2024) ముగియడంతో మార్కెట్ క్యూ1 ఆదాయాలు, స్థూల వాతావరణం, ప్రపంచ సంకేతాలు, స్టాక్ ఫండమెంటల్స్ పై దృష్టి సారించింది.
నిఫ్టీ 50 సూచీలో 30 షేర్లు నష్టాల్లో..
బుధవారం నిఫ్టీ 50 ఇండెక్స్ లో బజాజ్ ఫిన్సర్వ్ (2.09 శాతం), టాటా కన్జ్యూమర్ (1.90 శాతం), బ్రిటానియా (1.88 శాతం) షేర్లు నష్టపోయాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్ (4.36 శాతం), టెక్ మహీంద్రా (3.12 శాతం), బీపీసీఎల్ (2.91 శాతం) షేర్లు లాభపడ్డాయి. సెక్టోరల్ ఇండెక్స్ ల్లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.89 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.76 శాతం, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.35 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.60 శాతం), ఎఫ్ఎంసీజీ (0.53 శాతం) కూడా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మీడియా (2.47 శాతం) లాభాలతో ముగిసింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ (1.69 శాతం), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (1.08 శాతం), రియల్టీ (0.78 శాతం), ఫార్మా (0.74 శాతం) లాభాలతో ముగిశాయి.