7,000 charging stations: దేశ వ్యాప్తంగా 7 వేల చార్జింగ్ స్టేషన్స్; బీపీసీఎల్, టాటా మోటార్స్ భాగస్వామ్యం
7,000 charging stations: బీపీసీఎల్ (BPCL) భాగస్వామ్యంతో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 7 వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టాటా మోటార్స్, బీపీసీఎల్ ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఔట్ లెట్స్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.
7 వేల ఔట్ లెట్స్ లో..
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్’ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల (electric charging stations) ను ఏర్పాటు చేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తో ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం అంతటా ఉన్న దాదాపు 7 వేల బీపీసీఎల్ అవుట్‌లెట్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు.
1.15 లక్షల వాహనాలు..
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) కు చెందిన 1.15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్స్ పై ఉన్నాయి. టాటా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో బీపీసీఎల్ ఔట్ లెట్స్ లో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కో-బ్రాండెడ్ RFID కార్డ్ ద్వారా మరింత సౌకర్యవంతమైన చెల్లింపు వ్యవస్థను పరిచయం చేసే దిశగా ఆలోచిస్తున్నాయి.
నెక్స్ట్ ఈయర్ లో..
వచ్చే ఏడాది నాటికి 7,000 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తున్నట్లు బీపీసీఎల్ వెల్లడించింది. ముందుగా హైవే కారిడార్‌లలో 90కి పైగా EV ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కనీసం ప్రతీ 100 ల పరిధిలో ఒక చార్జింగ్ స్టేషన్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో టాటా మోటార్స్ 71 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో టియాగో EV, టిగోర్ EV, నెక్సాన్ EV ఉన్నాయి.