Stock market addiction: స్టాక్ మార్కెట్ యాప్ సోషల్ మీడియా లాగా వాడేస్తున్నారా? అడిక్ట్ అయ్యారేమో చూడండి..
Stock market addiction: ఆల్కహాల్, దూమపానం లాగా ట్రేడింగ్ యాప్స్ తరచూ చూడటం కూడా వ్యసనమే. అది మీకుందో లేదో, దాన్నుంచి ఎలా బయటపడాలో చూడండి.
బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ అడిక్షన్ నుంచి బయటపడలేక డీ అడిక్షన్ సెంటర్‌ను ఆశ్రయించారు. అంటే ఇది కూడా జూదానికి, ఒక వ్యసనానికి తక్కువేం కాదన్నమాట. దీనిక అలవాటుపడ్డవాళ్లు ఉదయం ఆఫీసులో పంచ్ వేయడం మర్చిపోతారేమో, కానీ ఉదయం 9.15 అయ్యిందంటే ఫోన్లో ఉన్న ట్రేడింగ్ యాప్ చూడటం మాత్రం మర్చిపోరు.
గ్రీన్ రంగు మీకు ఫేవరైట్ కలర్ అవుతుంది. ఎరుపు రంగు గ్రాఫ్ చూస్తే భరించలేరు. తరచూ ఫోన్లో సోషల్ మీడియా ఓపెన్ చేసేవాళ్లు.. ఇప్పుడు ట్రేడింగ్ యాప్స్ ఓపెన్ చేస్తారు. సోషల్ మీడియా వాడినట్లు రోజంతా ఈ యాప్స్ వాడేస్తారు. మీరు వెచ్చించాల్సిన సమయం కన్నా ఎక్కువ సమయం దీనిమీదే ఉంటే మీకు స్టాక్ మార్కెట్ అడిక్షన్ ఉన్నట్లే. దాన్నుంచి ఎలా బయటపడాలో చూడండి
స్టాక్ మార్కెట్ అడిక్షన్ వల్ల నష్టాలేంటి?
1. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బునే చూస్తూ ఉంటే పెరగదు. బదులుగా ఉపయోగకరమైన పనుల మీద దృష్టి పెడితే డబ్బు సంపాదించి దాన్ని సరిగ్గా తెల్సుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు.రోజంతా మీ విలువైన సమయాన్ని అవసరం లేకున్నా కూడా ఈ ట్రేడింగ్ యాప్స్ లో గడుపుతారు. మీకు తెలీకుండానే గంటల కొద్దీ సమయం ఖర్చు పెడతారు. వేరే పనులన్నీ పక్కదారి పడతాయి.
2. ఊరికే ఏం పెరుగుతున్నాయి? ఎంత తగ్గుతున్నాయి? అని చూస్తూ ఉంటే మీమీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దాని ప్రభావం వల్ల మీకు తెలీకుండానే మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీ రోజూవారీ జీవితం మీదా దీని ప్రభావం ఉంటుంది.
అడిక్ట్ అయ్యారా లేదా?
ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. దాన్ని బట్టి మీరు అడిక్ట్ అయ్యారా లేదా తెలిసిపోతుంది.
1. రోజుకు రెండు సార్ల కన్నా ఎక్కువ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేస్తున్నారా?
2. రోజూ ఒక షేర్ అమ్మడమో, కొనడమో.. ఏం చేయకపోతే మీకు తృప్తిగా ఉండదా?
3. లోన్లు తీసుకొని స్టాక్స్‌లో పెట్టడం, మీ రోజూవారీ, నెలవారీ ఖర్చుల కోసం కేటాయించుకున్న డబ్బుల్ని కూడా స్టాక్స్ లో పెట్టేయడం చేస్తున్నారా?
4. ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేయకపోతే చాలా ఒత్తిడిగా, మీకు తెలీకుండా ఏదో జరిగిపోతోందనే ఆందోళన ఉంటోందా?
5. ఆనందం కోసం ఇదివరకు రీల్స్ చూస్తున్నట్లు, ట్రేడింగ్ యాప్ చూస్తేనే ఆనందంగా ఫీలవుతున్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయినట్లే.
దీన్నుంచి ఎలా బయటపడాలి?
1. మీరు వాడే ట్రేడింగ్ యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు మిమ్మల్ని ఎక్కువగా యాప్ ఓపెన్ లాగా చేస్తాయి. కొత్త స్టాక్స్, స్టాక్ రికమెండేషన్లు లాంటి వాటికి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్లు రాకుండా చూసుకోండి. చాలా ముఖ్యమైన వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా నోటిఫికేషన్ కస్టమైజ్ చేసుకోండి.
2. రోజూ ఒక నిర్ణిత సమయంలో మాత్రమే యాప్ ఓపెన్ చేసేలాగా అలార్మం లాంటివి పెట్టుకోండి. ఒక వారం రోజులు దానికి కట్టుబడి ఉంటే అదే అలవాటు అవుతుంది.
3. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందే సమయం కేటాయించాలి కానీ, తర్వాత కాదు. మీరు చేసిన పరిశోధన మీద నమ్మకం పెట్టుకోండి. అంతేగానీ తరచూ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ చూడటం మానుకోండి.
టాపిక్