Son Killed Father: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలై, ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య-in debt from online betting father was killed by car for property ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Son Killed Father: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలై, ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య

Son Killed Father: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలై, ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య

Sarath chandra.B HT Telugu
Jul 18, 2024 01:54 PM IST

Son Killed Father: బెట్టింగులు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలైన తనయుడు కన్నతండ్రిని ఆస్తి కోసం కడతేర్చిన కిరాతక ఘటన మదనపల్లెలో జరిగింది. వ్యసనాలకు బానిసై చేసిన అప్పుల్ని తీర్చడానికి తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య చేయడం కలకలం రేపింది.

కుమారుడి దాడలో ప్రాణాలు కోల్పోయిన  చిన్న రెడ్డప్ప రెడ్డి
కుమారుడి దాడలో ప్రాణాలు కోల్పోయిన చిన్న రెడ్డప్ప రెడ్డి

Son Killed Father: పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన పుత్రుడు కన్నతండ్రి ప్రాణాలను బలి తీసుకున్న విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వ్యసనాల బారిన పడి చేసిన అప్పులు తీర్చుకోడానికి ఆస్తిలో వాటా కావాలని ఒత్తిడి చేసినా తండ్రి వినకపోవడంతో ఆగ్రహించిన తనయుడు ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో లక్షలు రుపాయలు పోగొట్టుకున్న యువకుడు వాటిని తీర్చేందుకు ఆస్తిలో వాటా కోసం తండ్రిని హత్య చేశాడు.

మదనపల్లెలో మానవత్వాన్ని మంటగలిపిన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రిని కారుతో ఢీకొట్టి కుమారుడు చంపేశాడు. ఆస్తిలో వాటా ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో కారుతో ఢీకొట్టి సొంత కొడుకే తండ్రి ప్రాణాలను బలి తీసుకున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

మదనపల్లెలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు రఘునాథరెడ్డి పట్ణణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసే వాడు. కొన్నాల్లుగా ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కొడుకు శంకర్‌రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

చిన్నరెడ్డప్ప రెడ్డి పెద్దకుమారుడు రఘునాథరెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌‌లో దాదాపు రూ.16 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రిని ఆస్తిలో వాటా రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. దీనికి తండ్రి సుముఖత చూపడం లేదు. ఆస్తి రాసిస్తే దానిని దుర్వినియోగం చేస్తాడనే అనుమానంతో కొడుకు ఒత్తిడి చేసినా ఆస్తి పంపకాలకు నిరాకరిస్తున్నాడు. దీంతో కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి వ్యవహారంలో వివాదం కొనసాగుతోంది.

బుధవారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఇంటికి సమీపంలో ఉన్న వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్న చిన్నరెడ్డప్పరెడ్డితో కొడుకు రఘునాథరెడ్డి గొడవ పెట్టుకున్నాడు. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రి తీరుతో ఆగ్రహానికి గురైన రఘునాథరెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడు శంకర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాడు. శంకర్‌రెడ్డి వెంటనే స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో బంధువులు, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం తెల్లవారుజామున మదనపల్లి వీవర్స్‌ కాలనీ సమీపంలో వాకింగ్ ట్రాక్‌ ఉన్న ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ యువరాజులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మృతుడి రెండో కుమారుడు శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని హత్య చేసిన రఘునాథ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కోసం కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కుమారుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner