Cyber crime: స్టాక్ ట్రేడింగ్ మోసంలో రూ.5.14 కోట్లు నష్టపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం
14 June 2024, 15:29 IST
Cyber crime: సైబర్ నేరస్తులు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. అందులో ఒకటి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కు సంబంధించిన మోసం. అలాంటి ఒక మోసంలో చిక్కుకుని ముంబై కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం రూ.5.14 కోట్లు నష్టపోయారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 5 కోట్ల నష్టపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
Cyber crime: ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ మోసంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతని కుటుంబ సభ్యులు రూ.5.14 కోట్లు పోగొట్టుకున్న కేసులో ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల కోసం సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించిన ట్యూషన్ టీచర్, సెక్యూరిటీ గార్డును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో ఇలా మోసపోయారు
పశ్చిమ శివారులోని సకినాకకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏప్రిల్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఆన్లైన్ షేర్ ట్రేడర్స్ వాట్సాప్ గ్రూప్ (whatsapp) లో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను యాడ్ చేశారు. వెంటనే షేర్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టాలన్న తన కోరికను ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వ్యక్తం చేశాడు. వెంటనే, అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో శిక్షణ ఇస్తామని, అది తీసుకుంటే, స్టాక్స్ ట్రేడింగ్ లో భారీగా లాభాలు ఆర్జించవచ్చని అతడికి చెప్పారు. దాంతో, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు.
వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్
ఆ తరువాత, ఒక లింక్ ను పంపి, ఆ లింక్ లోని యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కోరారు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అలాగే చేశాడు. దాంతో, అతడి పేరుపై ఒక వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ అయిందని, దాని ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు. ఆ తరువాత, దఫదఫాలుగా ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆ సైబర్ క్రిమినల్స్ కు పెద్ద మొత్తాల్లో డబ్బు పంపించాడు. వాళ్లు, అతడి వర్చువల్ అకౌంట్ లో ఆ మొత్తాన్ని స్టాక్స్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామని నమ్మించారు. అతడికి భారీగా లాభాలు వస్తున్నట్లు ఆ వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ లో చూపించారు. దాంతో, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబ సభ్యులు కూడా ఈ మాయలో పడిపోయారు. వారు కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. మొత్తంగా, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అతడి కుటుంబ సభ్యులు కలిపి రూ. 5.14 కోట్లు ఆ సైబర్ నేరగాళ్లకు పంపించారు. వారి ఇన్వెస్ట్ మెంట్ విలువ రూ. 87 కోట్లకు చేరుకుందని ఆ సైబర్ క్రిమినల్స్ వారిని నమ్మించారు.
మోసం తెలిసిందిలా..
అయితే, ఆ డబ్బు నుంచి కొంత నగదును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు వారికి అసలు మోసం అర్థమైంది. బాధితుల వర్చువల్ ఖాతాలో రూ.87.85 కోట్లు ఉన్నా, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోలేకపోయారు. తమ వద్ద నుంచి డబ్బు తీసుకున్న సైబర్ నేరగాళ్లను సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. దాంతో, వారు ముంబైలోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించి, కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తు
పోలీసుల విచారణలో బాధితులు డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు వారిలో ఒకరు హంప్రీత్ సింగ్ రాంధ్వా (సెక్యూరిటీ గార్డు)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, విమల్ ప్రకాశ్ గుప్తా అనే ట్యూషన్ టీచర్ తన కోసం బ్యాంకు ఖాతా తెరిచి ఆర్థిక లావాదేవీల కోసం సైబర్ మోసగాళ్లకు ఇచ్చాడని రాంధ్వా పోలీసులకు చెప్పాడు. దాంతో, పోలీసులు గోరేగావ్ లో విమల్ ప్రకాశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనకు ఆ నేరగాళ్లు నేరుగా తెలియదని, వారితో టెలిగ్రామ్ (telegram) యాప్ ద్వారా పరిచయం అయిందని గుప్తా పోలీసులకు చెప్పాడు. ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవడానికి సహాయం చేస్తే తనకు డబ్బు ఇస్తామని వారు చెప్పారని వివరించాడు.