Khammam Crime: లోన్లు ఇప్పిస్తామని మోసం.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు!-a gang involved in cyber fraud on the pretext of giving loans has been arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  A Gang Involved In Cyber Fraud On The Pretext Of Giving Loans Has Been Arrested

Khammam Crime: లోన్లు ఇప్పిస్తామని మోసం.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు!

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 01:17 PM IST

Khammam Crime: సైబర్ నేరగాళ్లు అమాయకులే అస్త్రంగా రెచ్చిపోతున్నారు. లోన్లు ఇప్పిస్తామని వల విసిరి నిండా ముంచేస్తున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి తొలుత నమ్మబలుకుతున్నారు. ఆనక దోచేస్తున్నారు.

ఖమ్మం ఎస్పీ రోహిత్ రాజు
ఖమ్మం ఎస్పీ రోహిత్ రాజు

Khammam Crime: ఖమ్మంలో సుధాకర్ అనే వ్యక్తి అశోక్ గుప్తా అనే మరో వ్యక్తితో కలిసి దుబాయ్ నుంచి మన దేశంలోని అమాయకులే టార్గెట్ గా మోసానికి తెరలేపారు. వీరిద్దరూ ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన కస్యా హర్ష కు ఫోన్ చేసి ట్రేడింగ్ చేయడానికి తమ బావ మరిది పేరిట ఒక కరెంట్ బ్యాంకు ఖాతా కావాలని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ఖాతాను తెరిచి ఇచ్చినందుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో ఖమ్మంలోని గాంధీచౌక్ HDFC బ్యాంకులో లోన్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న హర్ష ఆశపడ్డాడు. ముందుగా తన భార్య ప్రియాంక పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను వారికి పంపించాడు.

అనంతరం మరికొంత కాలానికి అశోక్ గుప్తా మళ్లీ హర్షకి ఫోన్ చేసి మరో ఐదు బ్యాంకు ఖాతాలు కావాలని చెప్పడంతో ఇల్లందు వాస్తవ్యురాలైన తన భార్య ప్రియాంకకు ఈ విషయం చెప్పాడు. అప్పుడు ప్రియాంక ఇల్లందులో తన స్నేహితుడైన చైతన్య అనే వ్యక్తికి చెప్పి అతనికి డబ్బు ఆశ చూపడంతో అతను తనకు తెలిసిన ఐదుగురు డ్వాక్రా మహిళలను రంగంలోకి దింపాడు.

ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఖమ్మం గాంధీచౌక్ లో బ్యాంకులో ఖాతాలను తెరిపించారు. తర్వాత ఆ వివరాలను హర్ష ద్వారా సుధాకర్, అశోక్ గుప్తాలకు పంపించాడు. ఖాతాలు తెరవడంలో సహకరించినందుకు చైతన్యకు హర్ష ఒక లక్ష రూపాయల నగదును ఇచ్చాడు.

బ్యాంకు ఖాతాలను తెరిచిన ఐదుగురు మహిళలకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల చొప్పున చైతన్య 75 వేల రూపాయలను వారికి ఇచ్చి మిగతా 25 వేలను అతను తీసుకుంటాడు. ఈ ఐదు బ్యాంకు ఖాతాలకు సంబందించి ఆన్లైన్ బ్యాంకింగ్, ATM కార్డుల వివరాలు సైతం దుబాయ్ లో ఉన్న అశోక్ గుప్తా చేతికి చేరాయి.

ఖాతాలతో ఏం చేస్తారంటే..

ఇబ్బడి ముబ్బడిగా బాంక్ ఖాతాలు తెరవడంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆరా తీశారు. అసలు అమాయకుల బ్యాంకు ఖాతాలతో ఏమి చేస్తున్నారనే అంశంపై కూపీ లాగారు. దుబాయిలో ఉంటున్న అశోక్ గుప్తా మరియు సుధాకర్ లు దుబాయ్ కేంద్రంగా ఇండియాలోని పలు వ్యాపారస్తులకు వల విసురుతున్నారు.

ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెడితే వారి నగదుకు చాలా రెట్లు కలిపి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారు. వారు జమ చేసే నగదును ముందుగానే ఓపెన్ చేసిన అమాయకుల ఖాతాల్లో జమ చేయించేస్తున్నారు.

అనంతరం ఆ ఖాతాల్లోని నగదును దుబాయ్ కి బదిలీ చేయించుకుని అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. గతంలో ఇదే తరహాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడిన అశోక్ గుప్తా, సుధాకర్ లపై హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

బ్యాంకు ఖాతా వివరాలు తెలపవద్దు - ఎస్పీ రోహిత్ రాజు

ఇతర దేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు అమాయకుల నగదును కాజేసి సైబర్ నేరాలకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వెల్లడించారు.

సైబర్ నేరాలకు నేరగాళ్లు ముందుగా కొంతమంది అమాయకుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలను తెరిచి సైబర్ నేరాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును ఆ ఖాతాల్లో జమ అయ్యేలా చేస్తున్నారని తెలిపారు.

దర్జాగా ఒక ప్రాంతంలో కూర్చొని స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అమాయకులకు మెసేజ్ లు, ఫోన్లు చేస్తూ అత్యాశకు గురిచేస్తూ వారి బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సులభంగా కాజేస్తున్నారని వివరించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.)

WhatsApp channel