తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iit Placements: విదేశీ ఆఫర్లనూ కాదంటున్న ఐఐటీ విద్యార్థులు.. ఎందుకంటే

IIT placements: విదేశీ ఆఫర్లనూ కాదంటున్న ఐఐటీ విద్యార్థులు.. ఎందుకంటే

HT Telugu Desk HT Telugu

06 December 2022, 11:09 IST

    • ఐఐటీ విద్యార్థుల్లో కొందరు విదేశీ ఆఫర్లను కూడా వదులుకుని దేశీయ కంపెనీల్లో చేరుతున్నారు.
విదేశీ ఆఫర్లను వదులుకుంటున్న ఐఐటీ విద్యార్థులు
విదేశీ ఆఫర్లను వదులుకుంటున్న ఐఐటీ విద్యార్థులు (HT)

విదేశీ ఆఫర్లను వదులుకుంటున్న ఐఐటీ విద్యార్థులు

ఐఐటీ విద్యార్థుల్లో చాలా మంది తాజా ప్లేస్‌మెంట్స్ సీజన్‌లో విదేశీ కొలువులను కాదని దేశీయ కొలువులకే మొగ్గు చూపారు. ఆయా విదేశీ సంస్థలు ఇచ్చే జీతభత్యాలకు సమానంగా ఇక్కడే లభించడం, అలాగే అధిక వృద్ధికి అవకాశాలు ఉండడం, ఉద్యోగ భద్రతతో పాటు సవాళ్లతో కూడిన రోల్స్ లభించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

‘కొందరు విద్యార్థులు అంతర్జాతీయ ఆఫర్లను కాదని ఇండియాలోనే జాబ్ ఆఫర్స్‌ యాక్సెప్ట్ చేశారు..’ అని ఐఐటీ-ఢిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విద్యా సంస్థలో ప్లేస్‌మెంట్స్ డిసెంబరు 1న ప్రారంభమయ్యాయి. దాదాపు 20 మంది విద్యార్థులకు విదేశీ జాబ్ ఆఫర్స్ లభించాయి. హాంగ్‌‌కాంగ్, నెదర్లాండ్స్, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, యూకే వంటి దేశాల్లో అక్కడి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి.

‘విద్యార్థులు దేశీయ కొలువులను ఎంచుకుంటున్నారు. ఇక్కడా విదేశీ జీతభత్యాలకు సమానంగా ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే..’ అని ఐఐటీ ఢిల్లీ ప్లేస్‌మెంట్ టీమ్ సభ్యుడొకరు చెప్పారు. ఆయా విద్యార్థులకు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (హెచ్‌ఎఫ్‌టీ) కంపెనీల నుంచి ఆఫర్లు లభించాయని చెప్పారు.

మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ మోడల్స్‌ను ఉపయోగించి మార్కెట్లను అనలైజ్ చేయగలిగే అభ్యర్థులకు ఈ హెచ్‌ఎఫ్‌టీలు, క్వాంట్ కంపెనీలు ఆఫర్లు ఇస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్‌ నుంచి ఐఐటీ విద్యార్థులకు ఆఫర్లు లభించాయి. కోట్లాది రూపాయల వేతనాలను ఆఫర్ చేశాయి.

జేన్ స్ట్రీన్ కాపిటల్ నుంచి టాప్ ఆఫర్ ఒకటి రూ. 4 కోట్ల వేతనంతో కూడి ఉంది. ఇతర ఐఐటీ క్యాంపస్‌లను సందర్శించిన ఇతర హెచ్‌ఎఫ్‌టీ, క్వాంట్ కంపెనీల్లో క్వాంట్ బాక్స్, స్వేర్ పాయింట్, టైబ్రా, క్వాడ్ఐ, గ్రేవిటన్ రీసెర్చ్ కాపిటల్, జేపీఎంసీ క్వాంట్, మావెరిక్ డెరివేటివ్స్, డా విన్సి ఉన్నాయి.

‘విభిన్న సెక్టార్లలో ఆఫర్లను విద్యార్థులు పోల్చి చూస్తున్నారు. విదేశాల్లో హెచ్ఎఫ్‌టీ ఆఫర్, దేశంలో హెచ్‌ఎఫ్‌టీ ఆఫర్ లభిస్తే విదేశాలు ఎంచుకుంటున్నారు. ఒకవేళ దేశంలో హెచ్‌ఎఫ్‌టీ ఆఫర్, ఇతర సెగ్మెంట్లలో విదేశాల్లో పోస్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడే హెచ్‌ఎఫ్‌టీ ఆఫర్ ఎంచుకుంటున్నారు..’ అని క్వాంట్‌బాక్స్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ మేనేెజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సింగ్ వివరించారు.

క్వాంట్‌బాక్స్ పది మంది కంటే ఎక్కువగా ఐఐటీ విద్యార్థులను హైర్ చేసుకుంది. వీరికి రూ. 1.3 నుంచి రూ. 1.4 కోట్ల వరకు వార్షిక వేతనాలు ఆఫర్ చేసింది. గ్లోబల్ ప్లేస్‌మెంట్స్ అయితే రూ. 1.6 కోట్ల నుంచి రూ. 2.4 కోట్ల వరకు ఆఫర్ చేసింది.

‘మంచి బ్రాండ్ గల భారతీయ కంపెనీ అయితే విద్యార్థులు దానినే ఎంచుకుంటున్నారు. అంతగా పేరు లేని విదేశీ కంపెనీల ఉద్యోగాలను ఎంచుకోవడం లేదు. ఆఫర్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిల్లో చేరడం లేదు..’ అని ఆర్థర్ డి. లిటిల్ కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్ బార్నిక్ మైత్రా వివరించారు.

‘వృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక యుఎస్ వీసా సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పని చేసే అవకాశం వంటివి ప్రభావం చూపుతున్నాయి..’ అని మైత్రా వివరించారు.

ఆర్థర్ డి. లిటిల్ ఐఐటీ ఖరగ్‌పూర్, బాంబే, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్ నుండి 15 మంది ఫ్రెషర్‌లను రూ. 20 లక్షల వార్షిక వేతనాలతో నియమించుకుంది.

టాపిక్