Jio plans: ప్లాన్ల ధరలు పెంచినా.. జియో నే చవక; ఎలాగో చూడండి..
02 July 2024, 17:50 IST
- గత వారం రోజుల్లో వరుసగా భారత్ లోని ప్రముఖ టెలీకాం ఆపరేటర్లైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ రీచార్జ్ టారిఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాదాపు అన్ని ప్లాన్స్ పై టారిఫ్ ను పెంచుతున్నట్లు తెలిపాయి. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆ సంస్థలు తెలిపాయి.
టారిఫ్ లు పెంచినా జియోనే చౌక
ఇటీవల భారత్ లోని మూడు ప్రముఖ టెలీకాం ఆపరేటర్లు జియో (jio), ఎయిర్ టెల్ (airtel), వొడా ఫోన్ ఐడియా (VI) వినియోగదారులపై పెను భారం మోపే నిర్ణయం తీసుకున్నాయి. అన్ని మొబైల్ రీచార్జ్ టారిఫ్ లను కనీసం 20% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, ఈ మూడు టెలీకాం ఆపరేటర్ల ప్లాన్స్ లో ఏ కంపెనీ టారిఫ్ చవక అన్న విషయాన్ని చూద్దాం.
జియోనే బెటర్
వినియోగదారులపై భారం వేసే విషయంలో మూడు సంస్థలు ఒకే బాటన పయనిస్తున్నాయి. అయితే, వాటిలో ప్లాన్ల వారీగా చూస్తే, జియో కాస్తంత చవకగా కనిపిస్తోంది. జియో ప్రి పెయిడ్ ప్లాన్స్ మిగతా రెండింటితో పోలిస్తే 20% వరకు తక్కవ టారిఫ్ తో ఉన్నాయి. అలాగే, పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో కూడా మిగతా రెండు టెలీకాం కంపెనీల కన్నా 29% తక్కువ ధరకే అందిస్తుంది.
10 నుంచి 21 శాతం వరకు పెంపు
గత వారం మొదట జియో 10 నుంచి 21 శాతం వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ తర్వాత ఎయిర్టెల్ కూడా 25 శాతం వరకు ధరలను పెంచింది. ఈ రేట్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జియో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ ప్లాన్ ధర రూ. 249 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే రూ. 299 గా ఉంది. అలాగే, రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియోలో రూ. 299 గా ఉండగా ఎయిర్టెల్ లో అయితే రూ. 349 గా ఉంది. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ. 349 కి అందిస్తుండగా, ఎయిర్ టెల్ లో ఇదే ప్లాన్ ధర రూ. 379 గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా జియో యూజర్లు 9 శాతం తక్కువ ధరతో రూ. 30 ఆదా చేసుకోవచ్చు.
మూడు నెలల ప్లాన్ లో..
మరో వైపు, మూడు నెలల ప్లాన్ల విషయానికి వస్తే.. 6 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ మూడు నెలల ప్లాన్ ధర జియోలో రూ. 479 గా ఉంది. అదే ఎయిర్ టెల్ లో అయితే 6 శాతం లేదా రూ. 30 ఎక్కువ ధరతో రూ. 509 గా ఉంది. రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 799 గా ఉంది. అదే ఎయిర్టెల్ అయితే 8 శాతం లేదా రూ. 60 ఎక్కువ ధరతో రూ. 859 గాఉంది. ఇక ఏడాది ప్లాన్ల పరంగా చూస్తే.. 24 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఒక ఏడాది పొందేందుకు జియో రూ. 1,899 ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. అదే ఎయిర్టెల్ అయితే 5 శాతం లేదా రూ. 100 ఎక్కువ ధరతో రూ. 1,999 కు ఈ ప్లాన్ ను అందిస్తోంది.