Jio Tariff Hike : జియో వినియోగదారులకు షాక్, భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు-జులై 3 నుంచి అమల్లోకి
Jio Tariff Hike : జియో వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. జియో టారిఫ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచింది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.
Jio Tariff Hike : రిలయన్స్ జియో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలు రెండూ పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు గురువారం ప్రకటించింది. దాదాపు అన్ని ప్లాన్‌లలో మొబైల్ సేవల రేట్లను పెంచింది. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత జియో మొబైల్ రీఛార్జ్ రేట్లను పెంచింది. జియో అత్యల్ప రీఛార్జ్ ధర రూ.15 నుంచి రూ.19కి పెంచింది. 1 GB డేటా యాడ్-ఆన్-ప్యాక్ కోసం రూ.15 ను రూ.19కి పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ఈ ప్లాన్ పై పెంపు కనిష్టంగా రూ.34, గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. 75 GB పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ ప్రస్తుతం ఉన్న రూ. 399 నుంచి రూ. 449 లకు పెంచింది. 84 రోజుల చెల్లుబాటుతో ఉన్న రూ.666 ప్లాన్ ధరను రూ.799కి పెంచింది. ఈ ప్లా్న్ ను దాదాపుగా 20 శాతం పెంచింది.
కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తూ...జియో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలకు ఉత్తమ సేవను అందజేస్తుందని తెలిపింది. జియో ట్రూ 5Gతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G రోల్‌అవుట్ సేవలు అందిస్తుందని పేర్కొంది. దేశంలో 5G సేవల్లో జియో అగ్రగామిగా ఉందని తెలిపింది. భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం 5G సెల్‌లలో దాదాపు 85 శాతం జియో వినియోగిస్తున్నారని వెల్లడించింది. జియో స్టాండ్-అలోన్ ట్రూ 5G నెట్‌వర్క్‌తో వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రముఖ ప్లాన్‌లపై అపరిమిత 5G డేటా అందిస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ... 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు పెట్టడంతో స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కొత్త ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రముఖ ప్లాన్ ల ధరలు
జియో కొత్త టారిఫ్ లో ప్రముఖ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగాయి. ఎంట్రీ-లెవల్ నెలవారీ ప్లాన్ గతంలో 28 రోజుల పాటు 2 GB డేటా కోసం రూ. 155 ధరలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లాన్ ధర రూ. 189 చేరింది. 28 రోజుల వ్యవధిలో రోజుకు 1 GB ప్లాన్‌ని ఎంచుకునేందుకు రూ. 209 నుంచి రూ. రూ. 249 చెల్లించాల్సి ఉంది. రోజుకు 1.5 GB ప్లాన్ ధర రూ. 239 నుంచి రూ. 299కు పెరిగింది. రోజుకు 2 GB ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుంచి రూ. 349కి పెరిగింది. అధిక డేటా వినియోగం కోసం రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచింది. రోజుకు 3 GB ప్లాన్ ను రూ. 399 నుంచి రూ. 449కి పెంచింది.
రెండు నెలల ప్లాన్ల ధరలు
జియో రెండు నెలల ప్లాన్ ల రీఛార్జ్ ధరలను పెంచింది. రోజుకు 1.5 జీబీతో రూ.479 ఉండే ప్లాన్ ఇప్పుడు రూ.579కు చేరింది. రోజుకు 2 జీబీ ప్లాన్ రూ.533 నుంచి రూ.629కి పెరిగింది. మూడు నెలల 6 జీబీ డేటా ప్లాన్ రూ.395 నుంచి రూ.479కు పెరిగింది. మూడు నెలల ప్లాన్స్ లో రోజుకు 1.5 GB ప్లాన్ ధర రూ. 666 నుంచి రూ. 799కు పెరిగింది. రోజుకు 2GB ప్లాన్ రూ. 719 నుంచి రూ. 859కి, రోజుకు 3GB ప్లాన్ రూ. 999 నుంచి రూ. 1199కు పెంచారు.
వార్షిక ప్లాన్ లు
ఏడాది రీఛార్జ్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రూ.1559 ధరతో అందుబాటులో ఉన్న 336 రోజుల 24 GB డేటా ప్లాన్ ఇప్పుడు రూ. 1899కు చేరింది. 365 రోజులకు పర్ డే 2.5 GB ప్లాన్ రూ. 2999 నుంచి రూ. 3599కు పెరిగింది. డేటా యాడ్ ఆన్‌లు రీఛార్జ్ కూడా పెరిగాయి. 1GB డేటా యాడ్ ఆన్ ధర రూ. 15 నుంచి రూ. 19, 2 GB యాడ్ ఆన్ రీఛార్జ్ రూ. 25 నుంచి రూ. 29కి, 6 GB యాడ్-ఆన్ రీఛార్జ్ ధర రూ. 61 నుంచి రూ. 69కి పెరిగింది. పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ లు కూడా పెరిగాయి. 30 GB ప్లాన్ గతంలో రూ. 299 ఉండగా ఇప్పుడు రూ. 349 అయ్యింది. 75 GB ప్లాన్ రూ. 399 నుంచి రూ. 449కి జియో పెంచింది. జియో అపరిమిత 5G సేవలను పొందేందుకు గతంలో రూ. 239 రీఛార్జ్ ఉండగా ఇప్పుడు రూ. 349కు పెంచారు. రోజుకు 2GB అంతకంటే ఎక్కువ ప్లాన్‌లపై మాత్రమే అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంటుందని జియో ప్రకటించింది.
సంబంధిత కథనం