Reliance Jio down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు డౌన్; వినియోగదారుల ఇక్కట్లు-reliance jio down users face major service outage across india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio Down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు డౌన్; వినియోగదారుల ఇక్కట్లు

Reliance Jio down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు డౌన్; వినియోగదారుల ఇక్కట్లు

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 04:23 PM IST

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో, వినియోగదారులు జియో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పొందలేకపోతున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ సహా అన్ని యాప్స్ ను యాక్సెస్ చేయలేకపోతున్నామని వినియోగదారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్ (Bloomberg)

Reliance Jio down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ వంటి ప్రముఖ యాప్ లను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఇంటర్నెట్ సమస్య ఏర్పడిన వారిలో 54% ఫిర్యాదులు మొబైల్ ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించినవి కాగా, 38% జియో ఫైబర్ అంతరాయాలకు సంబంధించినవి. 7% మొబైల్ నెట్వర్క్ సమస్యలకు సంబంధించినవి.

తరచూ అంతరాయాలు..

రిలయన్స్ జియో సేవల్లో ఇటీవలి కాలంలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయలేకపోవడంతో వారు ఉద్యోగ సంబంధ విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచి విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొబైల్ ఇంటర్నెట్, ఫైబర్ ఇంటర్నెట్ సేవల్లో ప్రధానంగా సమస్యలు తలెత్తుతున్నాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ వంటి కీలక అప్లికేషన్లను యాక్సెస్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం, 54 శాతం ఫిర్యాదులు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలకు సంబంధించినవి. జియో (jio) ఫైబర్ సేవలో అంతరాయాలకు సంబంధించి 38 శాతం, మొబైల్ నెట్ వర్క్ లతో 7 శాతం మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నో కామెంట్ ఫ్రమ్ జియో

ఇంటర్నెట్ అంతరాయం గురించి జియో టెలీకాం సంస్థ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, జియో అంతరాయంపై యూజర్లు మాత్రం ఎక్స్ (గతంలో ట్విట్టర్) సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియో కస్టమర్ కేర్ ఫిర్యాదులపై స్పందించడం లేదని మరికొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ బాగా తగ్గిపోయిందని, తాను కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు కాల్ ను ముగించారని ఒక యూజర్ పేర్కొన్నారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మీమ్స్ షేర్ చేస్తూ రిలయన్స్ జియోను ఎగతాళి చేశారు. ఎయిర్ టెల్ నుంచి హాట్ స్పాట్ సేవలను పొందాలని మరో నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Whats_app_banner