Android users: ఆండ్రాయిడ్ యూజర్లకు సెర్ట్ అలర్ట్; స్మార్ట్ ఫోన్స్ కు హ్యాకింగ్ ముప్పు ఉందని హెచ్చరిక
Warning for Android users: ఆండ్రాయిడ్ యూజర్లకు సెర్ట్ - ఇన్ హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేసే స్మార్ట్ ఫోన్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. హ్యాకింగ్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి..
Warning for Android users: భారత్ లో అత్యధిక స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైననే పని చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అప్ లతో అప్ డేట్స్ ను ఆండ్రాయిడ్ విడుదల చేస్తుంటుంది. అయితే, ఆండ్రాయిడ్ ఓల్డ్ వర్షన్స్ లోనే కొనసాగుతున్న యూజర్లు హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉంటుంది. వాటిలోని బలహీనతలకు సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది.
డేటా ను కోల్పోవచ్చు.. మాల్వేర్ ను ఇన్ స్టాల్ చేయొచ్చు
ఆండ్రాయిడ్ ఓఎస్ లోని ఈ లోపాలు ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి, వ్యక్తిగత సమాచారానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని సీఈఆర్టీ-ఇన్ (CERT-In) పేర్కొంది. ఇది ఫ్రేమ్ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్ డేట్స్, కెర్నల్, కెర్నల్ ఎల్ టిఎస్, ఆర్మ్ కాంపోనెంట్స్, మీడియాటెక్ కాంపోనెంట్స్, క్వాల్ కామ్ కాంపోనెంట్స్ మరియు క్వాల్ కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్ పై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆండ్రాయిడ్ యూజర్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్ పై పూర్తి నియంత్రణ సాధించడానికి అందులోని బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్స్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయవచ్చు. వినియోగదారు తన స్మార్ట్ ఫోన్ లేదా ఇతర ఆండ్రాయిడ్ డివైజ్ లో చేస్తున్న కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. వారి ఆండ్రాయిడ్ డివైజెస్ లోని డేటాను దొంగిలించవచ్చు. డివైజ్ పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు’’ అని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ (CERT-In) తెలిపింది.
ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లపై ప్రభావం పడుతుంది?
సెర్ట్-ఇన్ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. ఈ కింద పేర్కొన్న ఆండ్రాయిడ్ వర్షన్లకు హ్యాకింగ్ ముప్పు ఉంది. అవి ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14. అందువల్ల ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ తమ ఫోన్లలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సముచితం.
మీ ఆండ్రాయిడ్ డివైజెస్ ను ఎలా సంరక్షించుకోవాలి?
ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ లోని లోపాలను ఫిక్స్ చేస్తూ గూగుల్ ఇప్పటికే అప్ డేట్స్ ను రిలీజ్ చేసింది. వెంటనే ఆ అప్ డేట్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యూజర్లు సాధ్యమైనంత వరకు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలి. గుర్తు తెలియని సోర్సెస్ నుంచి యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవద్దు. అనుమానాస్పద యాప్ లకు ముఖ్యమైన పర్మిషన్లు ఇవ్వకూడదు. మీ స్మార్ట్ ఫోన్ ను సురక్షితంగా ఉంచడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ) ను ఎనేబుల్ చేసుకోండి.