TIME's list: ప్రఖ్యాత ‘టైమ్’ జాబితాలో టైటన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటా కంపెనీలు-times worlds most influential companies list includes reliance and tata ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Time's List: ప్రఖ్యాత ‘టైమ్’ జాబితాలో టైటన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటా కంపెనీలు

TIME's list: ప్రఖ్యాత ‘టైమ్’ జాబితాలో టైటన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటా కంపెనీలు

HT Telugu Desk HT Telugu
May 31, 2024 04:33 PM IST

TIME's list: ప్రతీ సంవత్సరం టైమ్ మాగజైన్ విడుదల చేసే ‘100 అత్యంత ప్రభావశీల కంపెనీ’ల జాబితాలో ఈ సంవత్సరం భారత్ కు చెందిన రెండు ప్రముఖ పారిశ్రామిక సంస్థలైన రిలయన్స్, టాటా గ్రూప్ చోటు సంపాదించాయి. ఇందులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థను 'టైటాన్స్' కేటగిరీలో చేర్చారు.

టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా గ్రూప్
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా గ్రూప్ (ANI)

TIME's Most Influential Companies' list: టైమ్ మ్యాగజైన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా పేర్కొంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థను, రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ సంస్థను 'టైటాన్స్' కేటగిరీలో చేర్చింది. ప్రతిష్టాత్మక టైమ్ 100 జాబితాలో రిలయన్స్ కంపెనీ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. ఈ జాబితాలో రెండుసార్లు చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ కావడం విశేషం. 2021లో కూడా 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల టైమ్ జాబితాలో రిలయన్స్ స్థానం సంపాదించింది.

58 ఏళ్ల క్రితం ప్రారంభం

రిలయన్స్ కంపెనీని టైమ్స్ జాబితా ‘భారత్ కు చెందిన అత్యంత బలమైన సంస్థ’గా అభివర్ణించింది. 58 ఏళ్ల క్రితం ధీరూభాయ్ అంబానీ ప్రారంభించిన టెక్స్ టైల్, పాలిస్టర్ ఎంటర్ ప్రైజ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. ఆత్మనిర్భర భారత్ కు కలలు కంటున్న ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా రిలయన్స్ కంపెనీ వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, రిలయన్స్ భారత్ లోనే అత్యంత విలువైన సంస్థ అని టైమ్స్ వెల్లడించింది.

టాటా గ్రూప్ కు ప్రశంసలు

టైమ్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ ను కూడా చేర్చింది. రతన్ టాటా (Ratan Tata) నేతృత్వంలో అత్యున్నత శిఖరాలకు చేరిన టాటా గ్రూప్ (Tata Group) ను కూడా టైమ్స్ జాబితాలో 'టైటాన్స్' కేటగిరీలో చేర్చారు.

టాటా గ్రూప్ ప్రస్థానం

టాటా గ్రూప్ ప్రొఫైల్ ను వివరిస్తూ, ఆ కంపెనీపై టైమ్స్ జాబితా ప్రశంసలు కురిపించింది. ‘2023లో ఐఫోన్ లను అసెంబుల్ చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించింది. భారత్ లో ఇందుకు గానూ మరో ప్లాంటును కూడా నిర్మిస్తోంది. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ను అభివృద్ధి చేయడానికి ఎన్విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు 2023 సెప్టెంబర్లో టాటా సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది దేశంలోనే తొలి ప్రధాన సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రణాళికలను ప్రకటించింది’’ అని వివరించింది. మరోవైపు, కొరోనా వ్యాక్సీన్ తయారీతో ప్రఖ్యాతి గాంచిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థను టైమ్స్ జాబితాలో 'పయనీర్స్' కేటగిరీలో ఎంపిక చేశారు.