IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!-habit of searching everything on internet causes idiot syndrome know the symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idiot Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Anand Sai HT Telugu
May 18, 2024 12:47 PM IST

IDIOT Syndrome Symptoms In Telugu : ఈ కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఏ పని జరగడం లేదు. కానీ ప్రతీ విషయాన్ని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం అనేది ఇడియట్ సిండ్రోమ్‌కు కారణం అవుతుంది.

ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు
ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు (Unsplash)

దగ్గు వచ్చినా.. తుమ్ము వచ్చినా.. ఎక్కడికైనా వెళ్లాలి అన్నా.. దేని గురించైనా తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఇంటర్నెటే. ఇది లేకుండా బతకలేం అనేలా మనిషి తయారవుతున్నాడు. కానీ ఇలా ప్రతి విషయాన్నీ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం అనేది ఓ వ్యాధికి కారణం అవుతుంది. ఆ విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు పడతారు.

ఎందుకంటే ఇప్పుడు జబ్బు వస్తే ఆసుపత్రికి పరుగెత్తే సమయం లేదు జనాలకు. ముందుగా మొబైల్‌లో ఓపెన్ చేసి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే వారు డాక్టర్ల కంటే తమకు ఎక్కువ తెలిసినట్లుగా ఫీలవుతారు. కొందరైతే వైద్యులకే పాఠాలు చెబుతున్నారు. ఇదంతా ఇంటర్నెట్ దయ. ఇంటర్నెట్ ద్వారానే ఏ వ్యాధికి ఏ ఔషధం అని తెలుసుకుంటున్నారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఈ కథనం తప్పకుండా చదవాలి.

ఇప్పుడు మన అరచేతిలో ప్రపంచం ఉంది. అదే ఫోన్. సెకనులో ఏ మూలలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏ ఆహారం బాగుంటుంది నుంచి ఏ వ్యాధికి మందు, అన్ని సమాచారం మనకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. దీనివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుండగా, కొందరికి తెలియకుండానే నష్టపోతున్నారు.

మొబైల్ లోనే సమస్త సమాచారం అందుబాటులో ఉండడంతో వ్యాధి కనిపించిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఇంటర్నెట్ ప్రకారం మెడిసిన్ తీసుకుంటారు చాలామంది. వారు ఆందోళన చెందుతున్న లక్షణాలను ఇంటర్నెట్‌లో టైప్ చేసి, అది ఏ వ్యాధి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు వ్యాధిని గుర్తించడమే కాకుండా ఇంటి నివారణ లేదా మందులను కూడా తీసుకుంటారు. ఒక వ్యక్తికి జ్వరం లేదా దగ్గు ఉన్నా, అతను మొదట ఇంటర్నెట్‌లో పేర్కొన్న అన్ని ఇంటి నివారణలు లేదా మందులను ప్రయత్నిస్తాడు. ఈ మందులలో ఏదీ ప్రభావం చూపకపోతే అప్పుడు వైద్యుడు గుర్తుకు వస్తాడు.

మైనర్ నుంచి మేజర్ వరకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మీరు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఇంటర్నెట్‌కి వెళితే ఇప్పుడే మేల్కోండి. మీరు ఇడియట్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏంటి? దాని దుష్ప్రభావాలు, పరిష్కారం గురించి చదవండి

ఇడియట్ సిండ్రోమ్ అంటే

ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్టింగ్ ట్రీట్‌మెంట్‌ను ఇడియట్ సిండ్రోమ్ అంటారు. ఇది వ్యక్తి మానసిక స్థితికి సంబంధించినది. ఒక వ్యక్తి డాక్టర్ కంటే ఇంటర్నెట్‌ని ఎక్కువగా విశ్వసిస్తాడు. అతను ఇంటర్నెట్ సహాయంతో తన వ్యాధికి చికిత్స పొందేందుకు ప్రయత్నిస్తాడు.

ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు

మొదటి లక్షణం ఏంటంటే వ్యక్తి వైద్యుని మాటలు, చికిత్సపై విశ్వాసం కోల్పోవడం. ఇంటర్నెట్ అన్నింటికీ సహాయపడుతుందని నమ్మడం. తీవ్రమైన అనారోగ్యంగా భావించే వ్యక్తి తనను బాధిస్తున్న లక్షణాలు తగ్గకపోగా నిస్పృహకు లోనవుతాడు. అతను ఎప్పటికప్పుడు ఆందోళన చెందడం ప్రారంభిస్తాడు.

ఇడియట్ సిండ్రోమ్ కారణాలు

ఇడియట్ సిండ్రోమ్‌కు అనేక కారణాలు ఉన్నాయి. ఇది తరచుగా మెదడులోని రసాయన మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. మానసిక స్థితి కూడా దీనికి కారణం. కొందరు ప్రతికూల భావాలను పెంచుకుంటారు. అసలు సమస్య నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు రోగికి వ్యాధి గురించి సరైన సమాచారం వైద్యుని నుండి అందకపోతే లేదా తగిన చికిత్స అందుబాటులోకి రాకపోతే, ప్రజలకు వైద్యునిపై నమ్మకం పోతుంది. ఇంటర్నెట్‌లో సమాచారం పొందాలని చూస్తారు. ఇక్కడ లభించిన సమాచారంతో చిన్నపాటి జబ్బు నయమైతే వారి విశ్వాసం రెట్టింపు అవుతుంది. డబ్బు లేకపోవడం కూడా తరచుగా వైద్యుల వద్దకు వెళ్లే బదులు ఇంటర్నెట్ వైపు మళ్లేలా ప్రజలను ప్రేరేపిస్తుంది.

బయటపడటం ఎలా

మీరు ఇడియట్ సిండ్రోమ్ నుండి బయటపడాలి. మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ముందుగా మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవాలి. మీకు పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. ఏ వ్యాధితో బాధపడుతున్నా, ముందుగా వైద్యుడిని సంప్రదించండి. మెడికల్ వెబ్‌సైట్‌లోనే సమాచారాన్ని పొందండి. సరైన సమాచారం లేకుండా ఇంటర్నెట్‌లో మీరు కనుగొన్న ప్రతి విషయాన్నీ నమ్మవద్దు.

WhatsApp channel

టాపిక్