రిలయన్స్ జియో సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ వంటి ప్రముఖ యాప్ లను యాక్సెస్ చేయలేకపోతున్నామని కస్టమర్లు వాపోతున్నారు . జియో కస్టమర్ల నుంచి 54% ఫిర్యాదులు మొబైల్ ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించినవి, 38% జియో ఫైబర్ అంతరాయాలకు సంబంధించినవి మరియు 7% మొబైల్ నెట్వర్క్ సమస్యలకు సంబంధించినవి వస్తున్నాయి.
స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ వంటి కీలక అప్లికేషన్లను రిలయన్స్ జియో వినియోగదారులు యాక్సెస్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. దాంతో, వారు సోషల్ మీడియా కేంద్రంగా జియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియో కస్టమర్ కేర్ కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్తున్నారు. డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం, 54 శాతం ఫిర్యాదులు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలకు సంబంధించినవి. జియో ఫైబర్ సేవలో అంతరాయాలకు సంబంధించి 38 శాతం, మొబైల్ నెట్ వర్క్ లతో 7 శాతం మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ అంతరాయం గురించి జియో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
జియో కస్టమర్ కేర్ ఫిర్యాదులపై స్పందించడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ బాగా తగ్గిపోయిందని, తాను కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అసలు స్పందించలేదని ఒక యూజర్ పేర్కొన్నారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మీమ్స్ షేర్ చేస్తూ రిలయన్స్ జియోను ఎగతాళి చేశారు. జియో యూజర్లు ఎయిర్ టెల్ నుంచి హాట్ స్పాట్ సేవలను పొందాలని మరో యూజర్ కామెంట్ చేశాడు.