H-1B visa revamp: ‘హెచ్-1బీ’ వీసా పై అమెరికా కీలక నిర్ణయం; భారతీయులకు ప్రయోజనకరమేనా?
18 December 2024, 16:11 IST
H-1B visa revamp: భారతీయ ఉద్యోగుల కలల వీసా అయిన హెచ్ 1 బీ వీసా సిస్టమ్ పై అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హెచ్ 1 బీ వీసా సిస్టమ్ లో కీలక సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తుల క్రమబద్ధీకరణ, దుర్వినియోగాలను అరికట్టడం లక్ష్యంగా ఈ సంస్కరణలను ప్రకటించింది.
‘హెచ్-1బీ వీసా పై అమెరికా కీలక నిర్ణయం
H-1B visa revamp: హెచ్ 1 బీ వీసా సిస్టమ్ లో కీలక సంస్కరణలకు అమెరికా ప్రభుత్వం తెర లేపింది. హెచ్ 1 బీ వీసాల దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఈ సిస్టమ్ లో దుర్వినియోగాలను అరికట్టడం లక్ష్యంగా బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో పలు మార్పులను ఆవిష్కరించింది.
హెచ్ 1 బీ వీసా సంస్కరణలు
మూడు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అంతర్జాతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేయడానికి ఒక మార్గం. ఈ విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో వచ్చాయి. దాంతో చట్టపరమైన వలసలకు సంబంధించి ప్రభుత్వ విధానంలో సంస్కరణలు అవసరమని అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. అయితే, అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రాబోయే ప్రభుత్వం ఈ మార్పులను ఎలా ఎదుర్కొంటుందో కచ్చితంగా తెలియదు.
కొత్త నిబంధనలు అమలు ఎప్పుడు?
అధ్యక్షుడు బైడెన్ (BIDEN) పదవి నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు, అంటే 2025 జనవరి 17 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్దేశించిన 85,000 పరిమితిని మించి ఏటా లక్షలాది మంది హెచ్ -1బీ వీసాకు దరఖాస్తులు వస్తున్నాయి. అమెజాన్, గూగుల్, టెస్లా వంటి టెక్ దిగ్గజాలు ఈ హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ కు అతిపెద్ద లబ్ధిదారులలో ఒకరుగా ఉన్నాయి. 2024 లో 4 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ఈ హెచ్ 1 బీ వీసాల కోసం వచ్చాయంటే, ఈ కేటగిరీలో ఉన్న తీవ్రమైన పోటీని అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమైన నిబంధనలు
- దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీ తో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీనివల్ల ఈ వీసా సిస్టమ్ దుర్వినియెగం తగ్గుతుంది.
- పొడిగింపు (extension) అభ్యర్థనలను ప్రాసెస్ చేసేటప్పుడు, అంతకుముందు పొందిన అనుమతులను వాయిదా వేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఉంటుంది.
- అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారులకు హెచ్ 1 బీ వీసా (h1b visa) ఉద్యోగులు ఉన్న వర్క్ ప్లేస్ తనిఖీలు చేసే అధికారాలను మరింత పెంచారు. హెచ్ 1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారాలను పెంచారు.
- వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయనున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.
హెచ్-1బీ దరఖాస్తు ఫీజు
హెచ్-1బీ దరఖాస్తుకు సాధారణ రుసుము పేపర్ సమర్పణలకు 780 డాలర్లు, ఆన్లైన్ దరఖాస్తులకు 730 డాలర్లు, నిర్దిష్ట పరిస్థితులకు అదనపు రుసుముతో. ఏదేమైనా, చిన్న యజమానులు మరియు లాభాపేక్షలేని సంస్థలు తగ్గించిన ఫీజు అయిన 460 డాలర్లు చెల్లించాలి.