ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్ కాయిన్ డిసెంబర్ 5న తొలిసారి లక్ష డాలర్ల గరిష్టాన్ని తాకింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన నాటి నుంచి బిట్ కాయిన్ వ్యాల్యూ పెరుగుతూనే ఉంది. తన తదుపరి పదవీకాలంలో క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణం ఉంటుందనే అంచనాలను ట్రంప్ పెంచడంతో క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ పెరుగుతోంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ఈసీ) తదుపరి చీఫ్ గా క్రిప్టో ప్రతిపాదకుడు పాల్ అట్కిన్స్ న డిసెంబర్ 4న ట్రంప్ నామినేట్ చేశారు.
మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 6.84 శాతం పెరిగి 102,388.46 డాలర్ల వద్ద ఉంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.55 గంటలకు 103,047.71 డాలర్లకు చేరింది. ఈ వృద్ధి బిట్ కాయిన్ ఏర్పడిన 16 సంవత్సరాల తరువాత వచ్చింది. ముఖ్యంగా 2022 లో బిట్ కాయిన్ విలువ 16,000 డాలర్లకు పడిపోయింది. నవంబర్ 5న అమెరికా ఎన్నికలలో ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి ఈ టోకెన్ విలువ రెట్టింపు అయింది. క్రిస్మస్ నాటికి బిట్ కాయిన్ ధరలు 1,20,000 డాలర్లకు చేరుకోవచ్చు.
ట్రంప్ కు క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో వాటాలున్నందువల్ల అతని మద్దతు స్థిరంగా ఉంటుందని పెట్టుబడిదారులను ఆశిస్తున్నారు. సెప్టెంబర్ లో ట్రంప్ (donald trump) తన కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ ప్రమోట్ చేసిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వికేంద్రీకృత ఫైనాన్స్ (DIF) విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న డిజిటల్ అసెట్ ప్లాట్ఫామ్ అని, ఇది ఆర్థిక భద్రతకు, స్వేచ్ఛగా లావాదేవీలు నిర్వహించడానికి సహాయపడుతుందని నివేదిక తెలిపింది. అయితే, గతంలో ఒకప్పుడు బిట్ కాయిన్ ను ట్రంప్ "స్కామ్" అన్నారు. ఆ తరువాత ఆయన మనస్సు మార్చుకున్నారు. ‘‘అమెరికాను క్రిప్టో క్యాపిటల్ గా చేయబోతున్నాం. మనం (అమెరికా) చేయకపోతే చైనా ఆ పని చేస్తుంది. చైనా ఎలాగూ ఆ పని చేస్తోంది. కానీ మనం అలా చేయకపోతే, మనం వెనుకబడిపోతాం’’ అని ట్రంప్ వ్యఖ్యానించారు.