Dubai visa rejection : భారతీయుల 'దుబాయ్' కలలకు బ్రేక్! కొత్త రూల్స్‌తో భారీగా వీసా రిజెక్షన్స్..
Dubai visa rejection : యూఈఏ తీసుకొచ్చిన కొత్త వీసా రూల్స్‌తో చాలా నష్టాలు జరుగుతున్నాయి! మరీ ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా, భారతీయుల వీసాలు భారీ మొత్తంలో రిజెక్ట్ అవుతున్నాయి. ఇది ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతోంది.
టూరిస్ట్ విసాల జారీ విషయంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి భారతీయుల దూబాయ్ వీసా అప్లికేషన్లు భారీ సంఖ్యలో రిజెక్ట్ అవుతున్నాయి! అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా, తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం.
దూబాయ్ వీసా కష్టాలు..!
గతంలో దుబాయ్‌కు వచ్చే వీసా దరఖాస్తుల్లో దాదాపు 99 శాతం ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు బాగా తయారు చేసిన డాక్యుమెంట్లను కూడా తిరస్కరిస్తున్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
గల్ఫ్ నగరాన్ని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం యూఏఈ ఇటీవల కొత్త, కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం పర్యాటకులు తమ హోటల్ బుకింగ్ వివరాలు, రిటర్న్ టికెట్లను సైతం సమర్పించాల్సి ఉంటుంది. తమ బంధువుల వద్ద ఉంటున్న వారికి వసతికి సంబంధించిన రుజువులు కూడా చూపించాల్సి ఉంటుంది. అదనంగా, ప్రయాణికులు దుబాయ్‌లో ఉండటానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు హోటళ్లలో బస చేయాలనుకుంటే వారి చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెట్ రూ .50,000 ఉండాలి. పాన్ కార్డును కూడా అందించాలి.
రోజువారీ వీసా తిరస్కరణలు..
గతంలో వీసా తిరస్కరణ రేటు 1-2 శాతం ఉండేది. కానీ ఇప్పుడు రోజుకు దాదాపు 100 దరఖాస్తుల వస్తుంటే, వాటిల్లో నుంచి కనీసం 5-6 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి.
కన్ఫర్మ్ అయిన విమాన టికెట్లు, హోటల్ బస వివరాలు జతచేసినా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని పసియో ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిఖిల్ కుమార్ తెలిపారు.
"ప్రయాణికులు దుబాయ్‌లో బంధువుల వద్ద ఉండి, హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, నివాస వీసా కాపీ, కాంటాక్ట్ వివరాలు వంటి తప్పనిసరి పత్రాలను జతచేసినా వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సందర్భాల్లో, ఖాతాదారులు ఇప్పటికే విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్ కోసం డబ్బులు కెట్టేశారు," అని కుమార్ తెలిపారు.
దుబాయ్ వీసా రిజెక్షన్ నేపథ్యంలో వీసా రుసుములతో పాటు, ముందుగా బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్ పై కూడా ప్రయాణికులు డబ్బును కోల్పోతున్నారు.
విహార్ ట్రావెల్స్ డైరెక్టర్ రిషికేశ్ పూజారి తన క్లయింట్లలో ఒకరి గురించి మాట్లాడుతూ.. “నేను నలుగురు సభ్యుల కుటుంబాన్ని ఇటీవలే డీల్ చేశాను. వారు తమ దరఖాస్తును జాగ్రత్తగా సిద్ధం చేశారు. ధృవీకరించిన హోటల్ బుకింగ్స్, విమాన వివరాలు వంటి అన్ని సంబంధిత పత్రాలను జత చేశారు. అయినప్పటికీ వారి వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది,” అని అన్నారు.
మరో ఘటనలో 35 మందితో కూడిన బృందం దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసింది. కుటుంబ సభ్యుల్లో ఒకరి వీసా తిరస్కరణకు గురికావడంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
దుబాయిలో తమ బంధువులతో కలిసి ఉండాలనుకున్న ఇద్దరు ప్రయాణికుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని హస్ముఖ్ ట్రావెల్స్ డైరెక్టర్ విజయ్ ఠక్కర్ మీడియాకు తెలిపారు.
“వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు, కొత్త వీసా అవసరాలకు అనుగుణంగా అన్ని సంబంధిత పత్రాలను జత చేశాం. అయినా వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయారు. వీసా ఫీజుల కోసం దాదాపు రూ.14,000, టికెట్ రద్దు ఖర్చు మరో రూ.20,000, అంతకంటే ఎక్కువే,” అని ఠక్కర్ తెలిపారు.
సంబంధిత కథనం