YSRCP Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
22 December 2024, 18:10 IST
- YSRCP Protest : వైసీపీ పోరుబాట పడుతోంది. ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చిన జగన్.. ప్రజల తరఫున పోరాడేందుకు రెడీ అయ్యారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. మొదటగా.. కరెంట్ ఛార్జీల పోరు చేయాలని జగన్ నిర్ణయించారు. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ ప్లాన్ చేసింది.
వైసీపీ పోరుబాట
కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట పడుతోంది. పోరుబాట పోస్టర్ వైసీపీ నేతలు తాజాగా ఆవిష్కరించారు. ప్రజల నడ్డి విరిచేందుకే కరెంట్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు ఆరోపించారు. కరెంట్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని, చంద్రబాబు బాదుడు బాబుగా మారారని విమర్శించారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని చెప్పారు.
వైసీపీ ఉపేక్షించదు..
'ప్రజలపై చంద్రబాదుడును వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు.. వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, కొనేవారు లేక మద్దతుధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్లు తెరిచింది' అని మాజీమంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.
ప్రజలందరూ రావాలి..
'ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచడం, గతంలో జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు.. ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి' అని మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు.
ప్రజలపై భారం..
రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు పెంచనున్నారని ప్రచారం జరిగింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్‌లు రూ. 11,826 కోట్ల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి పంపినట్లు తెలుస్తోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఛార్జీల పెంపు ప్రతిపాదనలు డిస్కమ్ లు ఈఆర్‌సీకి పంపాయి. ఈ ప్రతిపాదనలపై నవంబర్ 19వ తేదీలోపు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని ఏపీఈఆర్‌సీ కోరింది.
ఈఆర్సీ ఆమోదం..
అయితే 2022-23 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో రూ. 6200 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు.. అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, విద్యుత్ వినియోగాదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.