AP Liquor Prices: జగన్ బాటలోనే చంద్రబాబు, పాత ధరలతోనే మద్యం అమ్మకాలు.. కొనసాగనున్న ధరల బాదుడు, మద్యం ధరల జాబితా ఇదే..
AP Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మద్యం ధరలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కూటమి పార్టీలు, ప్రైవేట్ దుకాణాల్లో అవే ధరలను కొనసాగించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పినా, పాత ధరలతోనే లిక్కర్ సరఫరా చేస్తోంది.
AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం దుకాణాలు, బ్రాండ్ల లభ్యత, నాణ్యతపై మద్యం వినియోగదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు మద్యం అమ్మకాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.
మద్యం విక్రయాలు, డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకుని మద్యం వ్యాపారాన్ని వైసీపీ కొల్లగొడుతోందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు 2019 జూన్ నాటికి ఉన్న ధరలకు ఆ తర్వాత వైసీపీ కరెంట్ షాక్ కొట్టేలా పెంచిన ధరలతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. తాము అధికారంలోకి వస్తే మద్యం ధరల్ని నియంత్రిస్తామని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని చంద్రబాబు, పవన్ బహిరంగ వేదికలపై పలు సందర్భాల్లో ప్రకటించారు.
మరోవైపు ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల్లో మద్యం అమ్మకాలను ప్రారంభించారు. మద్యం ధరలు తగ్గాయనుకుని దుకాణాలకు వస్తున్న వారికి నిరాశ, భంగపాటు తప్పలేదు. మద్యం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పలు చోట్ల విక్రేతలతో వాగ్వాదానికి దిగారు. 99రుపాయల మద్యం కూడా చాలా చోట్ల అందుబాటులోకి రాలేదు. రూ.120కనీస ధర ఉన్న రకమే చాలా చోట్ల విక్రయించారు.
వైసీపీని చావు దెబ్బ తీసిన మద్యం బ్రాండ్లు…
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంలో మద్యం కూడా కీలక పాత్ర పోషించింది. సంపూర్ణ మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ చివరకు మద్యం అమ్మకాలతో అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలకు లింకు పెట్టి మద్యం అమ్మకాలు సాగించాడు.
మద్యం ధరలు గణనీయంగా పెరగడం, నాణ్యత లేకపోవడం, ఊరు పేరు లేని బ్రాండ్ల విక్రయాలను జే బ్రాండ్లుగా ప్రచారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. మద్యం ధరలు భారీగా పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా 2019తో పోలిస్తే రెట్టింపైంది.
మద్యంపై చేసిన ప్రచారం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. కేవలం 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ అనూహ్యంగా మూడు నెలల్లోనే కోలుకోడానికి ఊతమిచ్చేలా ప్రభుత్వ విధానాలు కలిసొస్తున్నాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆశించిన సమస్యలలో మద్యం, ఇసుక ధరలు ఉన్నాయి. శాంతి భద్రతలు, గంజాయి వినియోగం, ధరల నియంత్రణ, రాజకీయ పైరవీలతో సంబంధం లేకుండా ప్రజలను నిత్యం ప్రభావితం చేసే ఈ రెండు అంశాల్లో టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి కలిసొచ్చేలా ఉన్నాయి.
వారికి బాధ్యతలు కాకతాళీయమే..?
గనులు, మద్యం వంటి ఆదాయాన్ని ఆర్జించే శాఖలను 2019లో అప్పటి ఎన్నికల సంఘం బాధ్యతలు నిర్వహించిన అధికారులకు అప్పగించారు. అప్పట్లో ఈసీ తరపున ఏపీ సీఈఓగా పనిచేసిన గోపాల కృష్ణ ద్వివేదికి మైనింగ్ బాధ్యతలు ఏపీబేవరేజీస్ కార్పొరేషన్ బాధ్యతల్ని అదనపు సీఈఓ వివేక్ యాదవ్‌కు అప్పగించారు. 2024లో ఈసీ సీఈఓగా పనిచేసిన ముఖేష్ కుమార్ మీనాకు మైనింగ్ , ఎక్సైజ్ శాఖలను అప్పగించడం కాకతాళీయం కావొచ్చు. మద్యం ధరల విషయంలో మాత్రం జగన్ ఇచ్చిన కరెంట్ షాక్‌ను కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
మద్యంపై విధించే పన్నులు..
మద్యం ఉత్పత్తి సంస్థలు నేరుగా విక్రయించే అవకాశం లేకపోవడంతో తమ మద్యాన్ని ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తుంటాయి. మద్యం గరిష్ట ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. డిస్టిలరీలు ప్రభుత్వానికి సరఫరా చేసే ధరను బేసిక్ ధరగా పరిగణిస్తారు. ఈ ధరపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. ఆ మొత్తానికి స్పెషల్ మార్జిన్, హోల్‌సేల్ ట్రేడ్ మార్జిన్ విధిస్తారు. ఈ పన్నులన్నీ విధించిన తర్వాత వచ్చేదానిపై వ్యాట్ వసూలు చేస్తారు. ఈ మొత్తం ధరపై 20 శాతం రిటైలర్ మార్జిన్ విధిస్తారు. ఈ మొత్తంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ వేస్తారు. పన్నులన్నీ కలిపిన తర్వాత కొనుగోలుదారుడికి అందించే ధరను ఎమ్మార్పీగా ముద్రిస్తారు.
శ్లాబుల వారీగా పన్నులు
మద్యం ఉత్పాదక ధరతో పోలిస్తే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులే అధికంగా ఉంటున్నాయి. వైసీపీ హయంలో రకరకాల పేర్లతో మద్యం ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. మద్యం బేసిక్ ధర ఆధారంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ విధిస్తారు. ఇలా వసూలు చేసే పన్ను ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 137 శాతం నుంచి 226 శాతం వరకు ఉంటుంది. కొన్ని బ్రాండ్లపై ఉత్పాదక వ్యయం కంటే అధికంగా పన్నులు చెల్లిస్తున్నారు. బీర్లపై 211శాతం, వైన్‌పై 187శాతం, రెడీ టు డ్రింక్స్‌పై 39శాతం వసూలు చేస్తున్నారు.