తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Loan Apps Issue : లోన్ యాప్‌ల అరాచకాలను అణిచి వేయండి… రాజ్యసభలో సాయిరెడ్డి

Loan Apps Issue : లోన్ యాప్‌ల అరాచకాలను అణిచి వేయండి… రాజ్యసభలో సాయిరెడ్డి

HT Telugu Desk HT Telugu

12 December 2022, 14:03 IST

    • Loan Apps Issue :  దేశంలో లోన్‌ అప్లికేషన్ల అరాచకాలకు అణిచివేయాలని రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇన్‌స్టెంట్‌ రుణాల పేరుతో లోన్‌యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, బలవంతపు వసూళ్లపై  కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి
రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి

రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి

Loan Apps Issue తక్షణ రుణాల పేరుతో లోన్‌ యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్ళకు అణచివేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం లోన్‌ యాప్‌ ఆగడాలపై మాట్లాడారు. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడే అమాయకులకు తక్షణమే రుణం ఇస్తామంటూ లోన్‌ యాప్‌లు ఆకర్షిస్తున్నాయని లోన్‌ కోసం ఈ యాప్‌ ద్వారా రిక్వెస్ట్‌ చేసిన వారి ఫోన్‌ నుంచి సున్నితమైన మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌, ఫోటోలు, వీడియోలను సేకరించి వారికి రుణం మంజూరు చేస్తారని, రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా అధిక మొత్తంలో వడ్డీ, ఇతర చార్జీలు బకాయి పడినట్లుగా చూపిస్తారని వివరించారు.

బకాయిలు చెల్లించడానికి నిరాకరించే రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడటం ఈ లోన్‌ యాప్‌లు అవలంభించే విధానమని విజయసాయి రెడ్డి తెలిపారు. లోన్‌ యాప్‌లు అత్యధికంగా చైనా నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం లేకుండానే ఈ లోన్‌ యాప్‌లు యధేచ్చగా తమ అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు

ఆంధ్రప్రదేశ్‌లో సైతం లోన్‌ యాప్‌లు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌, నిర్బంధ వసూళ్ళ కారణంగా రుణగ్రహీతలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయన్నారు. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం వెంటనే లోన్‌ యాప్‌ ఏజెంట్లను అరెస్ట్‌ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుందన్నారు. ఇలాంటి సైబర్‌ నేరాల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ని రూపొందించిందన్నారు.

ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌లను అణచివేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సెంట్రల్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తో కలిసి పని చేస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లోన్‌ యాప్‌ల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని, అమాయక ప్రజల జీవితాలతో అవి చెలగాటం ఆడుతున్నాయన్నారు. వేధింపులు, బెదిరింపులతో రుణగ్రహీతలను తీవ్రమైన మనో వ్యధకు గురి చేస్తూ అనేక సందర్భాలలో వారు ఆత్మహత్యలకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయన్నారు.

ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లో వాటిని నిషేధించాలని సాయిరెడ్డి కోరారు. యాప్‌లు డెవలప్‌ చేసే వారిని వాటిని ప్రమోట్‌ చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఫోన్‌ డేటా ప్రైవసీకి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

టాపిక్