తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  War On Wishes : సిఎం శివరాత్రి శుభాకాంక్షలపై వైసీపీ,బీజేపీ మాటల యుద్ధం…

War On Wishes : సిఎం శివరాత్రి శుభాకాంక్షలపై వైసీపీ,బీజేపీ మాటల యుద్ధం…

HT Telugu Desk HT Telugu

20 February 2023, 7:51 IST

    • War On Wishes మహాశివరాత్రి పర్విదినాన్ని పురస్కరించుకుని ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు చెప్పిన విధానం వివాదాస్పదమవుతోంది.  ఈశ్వర ఆరాధన వివరించే క్రమంలో  ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రం హిందూ దేవతల్ని కించపరిచేలా ఉందంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు బీజేపీ విమర్శల్ని వైసీపీ తిప్పి కొడుతోంది. 
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ పోస్ట్ చేసిన ఫోటో
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ పోస్ట్ చేసిన ఫోటో

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ పోస్ట్ చేసిన ఫోటో

War On Wishes మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదివారం శివాలయాల వద్ద ఆందోళనలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపు ఇచ్చారు. బిజెపి నేతలతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పార్టీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పడంతో పాటు, శివరాత్రి రోజు పోస్ట్ చేసిన పోస్టర్ ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

శని త్రయోదశి, శివ రాత్రి ఒకేరోజు పర్వదినం రావడం తో శివ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని, ఈసందర్భంగా వైసీపీ ట్విట్టర్ లో హిందువుల్ని హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించడం బిజెపి సీరియస్ గా తీసుకుందని ఈ సందర్భంగా సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ కూడా ఆడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాజకీయ పార్టీ అధ్యక్షుడు హిందువుల ను కించ పరుస్తూ ఏ విధంగా పోస్ట్ చేస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలని , అరెస్టులకు వెనుకాడకుండా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడాన్ని, భగవంతునికి అన్నం పెట్టడంతో పోలుస్తారా? అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. ఆకలితో ఉన్నవారు, భగవంతుడు ఒకటేనా అని ప్రశ్నించిన విష్ణువర్ధన్ రెడ్డి భగవంతుని మీద అంత భక్తే ఉంటే, ఆలయాల మీద దాడులు జరిగినపుడు, విగ్రహాలను ధ్వంసం చేసినపుడు, రథాలను దగ్ధం చేసినపుడు ఏమైపోయింది ఆ భక్తి అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోరాటానికి పిలుపునివ్వడంతో వైసీపీ నాయకులు కూడా మాటల యుద్ధానికి దిగారు. అన్నార్తుల ఆకలి తీర్చడం తప్పాఅనిఎదురు దాడికి దిగారు. ముఖ్యమంత్రి ట్వీట్‌లో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయని ప్రశ్నించారు. బీజేపీ పూర్తిగా దిగజారి, వక్రీకరణలు చేస్తోందని, ఆనాడు బాబు పాలనలో 40 గుడులు కూల్చారని, అప్పుడు వారితో కలిసి అధికారంలో ఉన్నారని, ఆ పాపంలో మీకూ వాటా ఉందని ఆరోపించారు. దాన్ని మరిచిపోయి ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంకు కి హిందుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, ఆయన ఎక్కడా, ఎప్పుడూ ఎవరినీ అగౌరవపర్చలేదని వైసీపీ మంత్రులు తెలిపారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన అని చెబుతూ.. మా పార్టీ అఫీషియల్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశామని, రాష్ట్ర ప్రజలందరికీ శివయ్య చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని మరి అందులో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స అన్నారు. ఆ ట్వీట్‌లో పరమ శివుడ్ని కించ పర్చినట్లు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు.

శివరాత్రి రోజు బీజేపీ వాళ్లు శివాలయాలకు వెళ్లడం మర్చిపోయినట్లు ఉన్నారని, అందుకే ‘కోవెలకు వెళ్దాం’ అంటూ ధర్నాలు చేపట్టారని, బీజేపీ ఏ విధంగా దిగజారిపోతుందో, వక్రీకరిస్తుందో దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం సరికాదని బీజేపీ నేతలకు సూచించారు.

మహాశివరాత్రి రోజు సీఎం వైయస్‌ జగన్‌ కారికేచర్‌తో ఉన్న ట్వీట్‌లో వివాదాస్పదమైంది ఏదీ లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చిన్న పిల్లవాడికి పాలు పట్టడం నేరమా? దాన్ని బీజేపీ విమర్శించడం దుర్మార్గం అన్నారు. బీజేపీకి రాజకీయం తప్ప హిందూమతం, హిందూధర్మాన్ని రక్షించే ఆలోచన ఏ కోశాన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూత్వం గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీ నైజాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 40 గుడులను కూల్చినప్పుడు, అప్పుడు వారితో కలిసి అధికారం పంచుకున్న బీజేపీ ఏం చేసింది?. హిందుత్వం బీజేపీ బ్రాండ్‌ కాదు. హిందూత్వాన్ని వాడుకుని రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు.

ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్న దాంట్లో తప్పేమి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్నారని భావనతో . దాన్ని ఫోటో రూపంలో ఒక అభిమాని చిత్రించాడని, పెత్తందార్లైన బీజేపీ నాయకులు దాన్ని మత రాజకీయాలకు వాడుకోవడం మానవత్వమేనా అని నిలదీశారు.

టాపిక్