AP TG Union Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
25 October 2024, 16:15 IST
- AP TG Union Bank Jobs : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 13గా నిర్ణయించాయి.
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ విభాగం సెంట్రల్ ఆఫీస్.. దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా లోకల్ బ్యాంక్ ఆపీసర్ (ఎల్‌బీవో), (జేఎంజీఎస్-1 స్కేల్) 1,500 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ-224, ఎస్టీ-109, ఓబీసీ-404, ఈడబ్ల్యూఎస్-150, జనరల్ -613 పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా..
ఆంధ్రప్రదేశ్-200, తెలంగాణ- 200, తమిళనాడు- 200, కర్ణాటక-300, కేరళ-100, ఒరిస్సా-100, మహారాష్ట్ర - 50 పశ్చిమ బెంగాల్-100, అస్సాం-50, గుజరాత్ రాష్ట్రంలో 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ వారీగా పోస్టులు చూస్తే.. ఎస్సీ- 30, ఎస్టీ-15, ఓబీసీ-54, ఈడబ్ల్యూఎస్-20, జనరల్ -81 ఉన్నాయి. ఇందులో ఎనిమిది పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.
తెలంగాణలో..
తెలంగాణలో రిజర్వేషన్ వారీగా పోస్టులు చూస్తే.. ఎస్సీ- 30, ఎస్టీ-15, ఓబీసీ-54, ఈడబ్ల్యూఎస్-20, జనరల్ -81 ఉన్నాయి. ఇందులో ఎనిమిది పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్శిటీ, విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యూలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి..
2024 అక్టోబర్ 1 నాటికి వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు, మాజీ సైనికుద్యోగులకు ఐదేళ్లు, 1984 అల్లర్ల ప్రభావిత కుటుంబాలకు చెందిన వారికి ఐదేళ్లు వయస్సు సడలించారు.
వేతనం..
నెలకు రూ.48,480-రూ.85,920
ఎంపిక ప్రక్రియ..
ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్..
అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/ubisojan24/ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఉంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/ubi-lbo-231024.pdf పై క్లిక్ చేస్తే.. పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ పరీక్ష, సబ్జెక్టులు..
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు-60 మార్కులు), జనరల్ స్టడీస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు-40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు-60 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు-40 మార్కులు) మొత్తం 155 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహాయించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే (2 ప్రశ్నలు-25 మార్కులు). పరీక్ష ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.
ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు..
అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైరదాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)